నక్కి.. నక్కి కాదు.. తొక్కుకుంటూ పోవాలే.! ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ బ్యాటింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ను ఊచకోత కోసింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది. ఈ సమయంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆ వివరాలు

నక్కి.. నక్కి కాదు.. తొక్కుకుంటూ పోవాలే.! ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
Srh

Updated on: Mar 24, 2025 | 6:43 PM

ఊహించినట్లుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించింది. ఐపీఎల్ 2025లో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్లను ఉతికిఆరేశారు హైదరాబాద్ బ్యాటర్లు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరు సాధించి రికార్డుల్లోకి ఎక్కారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. మొదటి 6 ఓవర్లలో 94 పరుగులు రాబట్టింది. ఇది ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో నమోదైన మూడవ అత్యధిక స్కోరు. ఈ లిస్టులో మొదటి రెండు రికార్డులు కూడా హైదరాబాద్ పేరిట ఉన్నాయి.

హైదరాబాద్ ప్లేయర్ ఇషాన్ కిషన్.. ఆ ఫ్రాంచైజీ తరపున తొలి మ్యాచ్ ఆడగా.. మొదటి మ్యాచ్‌లోనే 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్ 2025లో తొలి సెంచరీ కాగా.. కిషన్ ఐపీఎల్ కెరీర్‌లోనూ మొదటి సెంచరీ కావడం విశేషం. మరోవైపు టీ20లలో ఇప్పటిదాకా నాలుగు 250+ స్కోర్లు చేసి రికార్డు సృష్టించింది సన్‌రైజర్స్. అలాగే ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా 528 పరుగులు వచ్చాయి. హైదరాబాద్ 286 రన్స్ చేయగా.. చేదనలో రాజస్థాన్ 242 పరుగులు చేసింది. దీంతో ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇరు జట్ల ఆటగాళ్లు 30 సిక్సర్లు, 51 ఫోర్లు బాదారు. అటు రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌లో 76 పరుగులు సమర్పించుకుని.. చెత్త గణాంకాలను నమోదు చేశాడు.