Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు? యూఏఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన పనికి అంతా ఫిదా!

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు అర్హుడని నిరూపించుకున్నాడు. సెప్టెంబర్ 10, బుధవారం దుబాయ్‌లో జరిగిన ఏషియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్​పై టీమిండియా విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది. సూర్యకుమార్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి, అందరి మనసులను గెలుచుకున్నాడు.

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు? యూఏఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన పనికి అంతా ఫిదా!
Suryakumar Yadav

Updated on: Sep 11, 2025 | 8:04 AM

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇచ్చే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు దక్కే అవకాశం ఉంది. బుధవారం, సెప్టెంబర్ 10న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో యూఏఈ బ్యాట్స్‌మన్‌కు వ్యతిరేకంగా అప్పీల్‌ను ఉపసంహరించుకుని టీమిండియా కెప్టెన్ గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. యూఏఈ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబే వేసిన ఒక షార్ట్ బంతికి జునైద్ సిద్ధిక్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చాడు. ఆ సమయంలో జునైద్ బ్యాట్స్‌మెన్ ఏమనుకున్నాడో తెలియదు కానీ, ముందుకు వచ్చాడు. అదే సమయంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ వికెట్లను పడగొట్టి అప్పీల్ చేశాడు.

థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. రీప్లేలలో, బెయిల్స్ పడేసమయానికి జునైద్ క్రీజ్‌కు తిరిగి రాలేదని నిర్ధారణ అయింది. దాంతో ఔట్ అని పెద్ద స్క్రీన్‌పై కనిపించింది. కానీ, జునైద్ క్రీజ్‌లోనే ఉన్నాడు. అదే సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో సూర్యకుమార్ ఫీల్డ్ అంపైర్‌తో ఏదో సైలెంటుగా మాట్లాడుతున్నాడు. కొన్ని క్షణాల తర్వాత, భారత జట్టు అప్పీల్‌ను ఉపసంహరించుకుందని ప్రకటించారు. దీనితో జునైద్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించగలిగాడు.

అప్పీల్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారు?

శివమ్ దూబే రన్-అప్ సమయంలో అతని నడుము నుంచి తువ్వాలు జారిపోవడం జునైద్ సిద్ధిఖీ గమనించాడు. అదే సమయంలో అతడి దృష్టి మళ్లింది. టీవీ కెమెరాలలో కూడా ఈ దృశ్యం కనిపించింది. ఈ కారణంగానే సిద్ధిఖీ క్రీజ్‌ నుంచి బయటకు వెళ్ళాడు. ఈ విషయం గమనించిన సూర్యకుమార్ యాదవ్ అప్పీల్‌ను ఉపసంహరించుకుని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఈ నిర్ణయంతో భారత జట్టు చట్టబద్ధంగా సరైనదే అయినప్పటికీ, సూర్యకుమార్ క్రీడాస్ఫూర్తితో అప్పీల్‌ను ఉపసంహరించుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా, జునైద్ సిద్ధిఖీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే ఓవర్​లో శివమ్ దూబే వేసిన మరో షార్ట్-పిచ్ బాల్​కు జునైద్ సిద్ధిఖీ అవుటయ్యాడు.

బౌలర్ల జోరు

భారత జట్టు బౌలర్ల దెబ్బకు యూఏఈ ఇన్నింగ్స్ కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ముగిసింది. శివమ్ దూబే 2 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ, ఈ మ్యాచ్‌కు అసలు స్టార్ కుల్దీప్ యాదవ్. అతను 4 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీశాడు. ఇందులో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం వికెట్ కూడా ఉంది. గత ఏడాది ప్రపంచకప్ తర్వాత మొదటిసారిగా టీ20 క్రికెట్‌లోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక వికెట్ తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..