SL vs ENG T20 World Cup : శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్.. పల్లెకెలెలో పవర్‌ఫుల్ ఫైట్.. లంక జట్టులో రెండు మార్పులు

SL vs ENG T20 World Cup : శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో అసలైన సమరం మొదలైంది. సూపర్-8 దశలో భాగంగా నేడు కాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి.

SL vs ENG T20 World Cup : శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్.. పల్లెకెలెలో పవర్‌ఫుల్ ఫైట్.. లంక జట్టులో రెండు మార్పులు
Sl Vs Eng Super 8 Live

Updated on: Feb 22, 2026 | 3:09 PM

SL vs ENG T20 World Cup : శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన సమరం మొదలైంది. సూపర్-8 దశలో భాగంగా నేడు కాండీలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, తేమ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సూపర్-8లో ఇది రెండో మ్యాచ్ కాగా, నిన్న జరగాల్సిన పాకిస్థాన్ – న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు రెండు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్ కుసాల్ పెరీరా స్థానంలో కామిల్ మిషారానూ, బౌలింగ్ విభాగంలో ప్రమోద్ మదుషన్ స్థానంలో అనుభవజ్ఞుడైన దుష్మంత చమీరాను తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా, గత మ్యాచ్‌లో ఆడిన విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తోంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో లంక బౌలర్లను ఎదుర్కోవడానికి సిద్ధమైంది.

చరిత్రను ఒకసారి తిరగేస్తే శ్రీలంకపై ఇంగ్లాండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 17 టీ20 మ్యాచ్‌లు జరగగా, అందులో 13 సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించింది. కేవలం 4 సార్లు మాత్రమే లంక గెలిచింది. ముఖ్యంగా గత 11 మ్యాచ్‌లుగా ఇంగ్లాండ్ వరుస విజయాలతో లంకను భయపెడుతోంది. అయితే శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక రికార్డ్ ఇక్కడ కీలకం కానుంది. రన్ ఛేజింగ్‌లో అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2024 నుంచి జరిగిన ఛేజింగ్‌లలో నిస్సంక సగటు 58.72గా ఉండటం లంక ఆశలను సజీవంగా ఉంచుతోంది.

గ్రూప్ స్టేజ్ లో ఇరు జట్లూ ఒక్కో ఓటమిని చవిచూశాయి. శ్రీలంకను జింబాబ్వే షాక్ ఇవ్వగా, ఇంగ్లాండ్‌ను వెస్టిండీస్ ఓడించింది. ఇప్పుడు సూపర్-8 దశలో సెమీఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ నిర్ణయాత్మకమే. ఈరోజు గెలిచే జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి, తద్వారా సెమీస్ బెర్త్ కోసం ఒక అడుగు ముందుకేసినట్లు అవుతుంది. పల్లెకెలెలో మ్యాచ్ ప్రారంభమైన తరుణంలో వరుణుడు కరుణిస్తే క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఖాయం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us