SL vs ENG : లంక ఆశలు ఆవిరి.. ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక

SL vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్‌-8 పోరులో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. పల్లెకెలె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 147 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.

SL vs ENG : లంక ఆశలు ఆవిరి.. ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన శ్రీలంక
Sl Vs Eng

Updated on: Feb 22, 2026 | 6:24 PM

SL vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్‌-8 పోరులో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. పల్లెకెలె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 147 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, లంక సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం పవర్‌ప్లే ముగిసే సమయానికే 34 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (9), కుసాల్ మెండిస్ (0), పవన్ రత్నాయకే (0) వెనువెంటనే అవుట్ కావడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లతో చెలరేగగా.. ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించారు.

మధ్యలో కమిందు మెండిస్ (13), కెప్టెన్ దసున్ శనక కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 15 పరుగుల మార్కును దాటలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖర్లో చమీరాను లియామ్ డాసన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో లంక ఇన్నింగ్స్ 95 పరుగుల వద్ద ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్, లంకను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (62) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. లంక బౌలర్లలో దునిత్ వెల్లా లగే (3 వికెట్లు), మదుశంక (2 వికెట్లు) ఇంగ్లాండ్‌ను కట్టడి చేసినప్పటికీ, బ్యాటర్లు చేతులెత్తేయడంతో వారి శ్రమ వృధా అయింది. ఒక దశలో 146 పరుగులు తక్కువ స్కోరు అనిపించినా, లంక బ్యాటర్ల వైఫల్యం ఇంగ్లాండ్‌కు సునాయాస విజయాన్ని కట్టబెట్టింది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us