టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఆసియా కప్ 2023 కోసం ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ప్లేయర్స్ చాలాకాలంగా గాయాలు కారణంగా జట్టుకు దూరమయ్యారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో తిరిగి ఫిట్‌నెస్ పొందేందుకు కఠోర శ్రమ చేశారు. అయితే వీరి ఎంపికపై మాత్రం అటు పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించడమే కాకుండా.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై తాజాగా ఎన్‌సీఏ అధికారి ఒకరు కీలక వివరణ ఇచ్చారు.
శ్రేయాస్ అయ్యర్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారని సదరు అధికారి వెల్లడించారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన ప్రాక్టిస్ మ్యాచ్‌లో ఇరువురూ చురుగ్గా ఫీల్డింగ్ చేశారని.. మునుపటి కంటే మరింత ఉత్సాహంగా కనిపించారని చెప్పారు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయడంతో పాటు 150 బంతులు ఎదుర్కుని 199 పరుగులు చేశారని పేర్కొన్నారు. ఓ ఆటగాడు ఫిట్‌నెస్ సాధించాడని చెప్పడంలో ఇంతకన్నా ఇంకేమి కావాలని ప్రశ్నించారు. గడిచిన రెండు నెలల్లో వీరిద్దరూ తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమించారు. రాహుల్, అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండానే సెలెక్టర్లు ఎంపిక చేశారన్నది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు.
ఎన్‌సీఏ ఫిట్‌నెస్ ప్రామాణికాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ ఫిట్‌నెస్ టెస్టులు క్లియర్ చేయాలంటే అంత ఆషామాషీ కాదు. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేశారంటూ రాద్దాంతాలు పెడుతున్నారు. ఇకనైనా అలాంటి కల్లబొల్లి కబుర్లు మానుకోవాలి. వారిద్దరూ పూర్తిగా ఫిట్‌గా ఉండటం వల్లే సెలెక్టర్లు ఎంపిక చేశారు.
కాగా, ఆగష్టు 30వ తేదీ నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్, నేపాల్, యూఏఈ ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఈ టోర్నీని సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఆ తర్వాత ఇండియా తన తర్వాత మ్యాచ్ సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలబడనుంది.
Been a long journey but I’m super grateful to the people who stood by my side to help me to get where I am today. Thank you Nitin bhai and Rajini sir and everyone at The NCA, who’ve been tirelessly helping me. Much love and much appreciated 🙏 pic.twitter.com/i6YEAV8u8r
— Shreyas Iyer (@ShreyasIyer15) August 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..