
Hardik Pandya : టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో, కొన్నిసార్లు మైదానం బయట కూడా అంతే వేడిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20కి ముందు హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్ ప్రాక్టీస్ కోసం మైదానంలోకి వస్తున్న సమయంలో, అక్కడ ఉన్న కామెంటేటర్ మురళీ కార్తీక్‌తో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగాడు. మొదట సాధారణంగా మొదలైన వీరి సంభాషణ, కొద్దిసేపటికే సీరియస్ చర్చగా మారింది. హార్దిక్ ముఖ కవళికలు చూస్తుంటే అతను చాలా కోపంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. హార్దిక్ మాట్లాడుతూ దూరం వెళ్లిపోవడం, మళ్ళీ వెనక్కి వచ్చి మురళీ కార్తీక్ దగ్గర నిలబడి గట్టిగా ఏదో చెప్పడం కనిపిస్తుంది. మురళీ కార్తీక్ కూడా తన వాదనను వినిపించడానికి ప్రయత్నించినప్పటికీ, హార్దిక్ ఏమాత్రం తగ్గలేదు. ఈ వీడియోను షేర్ చేసిన క్రికెట్ సెంట్రల్ అనే ఎక్స్ ఖాతా.. “రాయ్‌పూర్‌లో రెండో టీ20 ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా, మురళీ కార్తీక్ మధ్య పెద్ద గొడవ జరిగింది” అని పేర్కొంది. అయితే ఈ గొడవకు గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. కేవలం అది సరదా చర్చా లేక నిజంగానే విభేదాలా అన్నదానిపై స్పష్టత లేదు.
🚨 Hardik Pandya angry at Murali Kartik
– Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026
మరోవైపు న్యూజిలాండ్ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20లో బ్యాట్‌తో 25 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు. ఇక రాయ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు లక్ష్యాన్ని త్వరగా ముగించడంతో హార్దిక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, బౌలింగ్‌లో ఒక కీలక వికెట్ పడగొట్టి తన వంతు సహకారం అందించాడు.
ఈ గొడవ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు హార్దిక్ వైఖరిని తప్పుపడుతుంటే, మరికొందరు మురళీ కార్తీక్ ఏమైనా అనవసరమైన ప్రశ్నలు అడిగి ఉంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా హార్దిక్ మైదానంలో తన సహచర ఆటగాళ్లపై, ప్రత్యర్థులపై కోపం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సీనియర్ మాజీ క్రికెటర్‌తో ఇలా వ్యవహరించడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వివాదంపై అటు హార్దిక్ కానీ, ఇటు మురళీ కార్తీక్ కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..