బాల్ ఆఫ్ ది సెంచరీతో ప్రపంచానికి పరిచయం.. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన మణికట్టు మాంత్రికుడు..

|

Sep 13, 2022 | 7:51 AM

Shane Warne Birth Anniversary Special: మణికట్టు మాయాజాలంతో, వార్న్ తన స్పిన్ తో ఎంతోమంది లెజెండ్‌లను తన బాధితులుగా చేసుకున్నాడు. వార్న్ తన 145 మ్యాచ్‌ల టెస్టు కెరీర్‌లో 708 వికెట్లు పడగొట్టాడు.

బాల్ ఆఫ్ ది సెంచరీతో ప్రపంచానికి పరిచయం.. దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన మణికట్టు మాంత్రికుడు..
Shane Warne Birth Anniversary
Follow us on

Shane Warne Birth Anniversary Special: స్పిన్నర్ల గురించి మాట్లాడితే, ఆసియా దేశాల నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు కనిపిస్తారు. కానీ, ఈ ఖండం వెలుపల మంచి స్పిన్నర్‌ని ఊహించుకోవడం కష్టం. చాలా మంది స్పిన్నర్లు ఆసియా ఖండం నుంచి, ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్ నుంచి వచ్చినవారే. భగవత్ చంద్రశేఖర్, ఎరపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బోడి, అబ్దుల్ ఖాదిర్ ఇలా ఎందరో ఆసియా ఖండం నుంచే వచ్చారు. కానీ ఒక స్పిన్నర్ ఆసియా నుంచి మంచి స్పిన్నర్లు రాలేరనే అపోహను బద్దలు కొట్టాడు. ఈ స్పిన్నర్ పేరు షేన్ వార్న్. ఈ రోజు ఈ లెజెండ్ స్పిన్నర్ పుట్టినరోజు. 1969 సెప్టెంబర్ 13న విక్టోరియాలో జన్మించిన షేన్ వార్న్‌.. 2022 మార్చి 4న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. మణికట్టు మాయాజాలంతో, వార్న్ తన స్పిన్ తో ఎంతోమంది లెజెండ్‌లను తన బాధితులుగా చేసుకున్నాడు. వార్న్ తన 145 మ్యాచ్‌ల టెస్టు కెరీర్‌లో 708 వికెట్లు పడగొట్టాడు. ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకుని చరిత్ర నెలకొల్పాడు.

1993 యాషెస్‌లో మాంచెస్టర్‌లో జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గ్యాటింగ్‌కు గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ వేసిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బంతిగా పేరుగాంచింది. ఆ బంతి వార్న్ జీవితాన్ని మార్చేసింది.

వార్న్ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’..

షేన్ వార్న్ (1992–2007) తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో చాలా అద్భుతమైన డెలివరీలు సంధించాడు. అయితే 1993లో యాషెస్ సిరీస్‌లో అతను ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ అని పిలిచే ఒక బంతిని విసిరాడు. వార్న్ తన లెగ్ స్పిన్‌లో మైక్ గాటింగ్‌ను బౌల్డ్ చేశాడు. బంతి దాదాపు 90 డిగ్రీలు స్పిన్ అయింది.

వార్న్ వేసిన బంతి లెగ్-స్టంప్ వెలుపల బాగా సంధించాడు. బంతి వైడ్‌గా ఉన్నట్లు అనిపించింది. గాటింగ్ దానిని ఆడటానికి ప్రయత్నించలేదు. గ్యాటింగ్‌ను దాటుకుని వేగంగా లొపలికి వచ్చిన బంతి అతని ఆఫ్ స్టంప్‌ను తాకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ బంతి మైదానంలో, వెలుపల నా జీవితాన్ని మార్చేసిందని ఓ సందర్భంలో వార్న్ పేర్కొన్నాడు. బంతిని నేను వేసినందుకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టులో స్పిన్ బౌలింగ్‌లో నిష్ణాతుడైన మైక్ గ్యాటింగ్ లాంటి గొప్ప ఆటగాడిని పెవిలియన్ చేర్చడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

వార్న్‌కు మొదటి బాధితుడు రవిశాస్త్రి..

జనవరి 1992లో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో వార్న్ అరంగేట్రం చేశాడు. రవిశాస్త్రిని తన మొదటి బాధితుడిగి మార్చుకున్నాడు. ఆపై 206 పరుగుల వద్ద వార్న్ వేసిన బంతికి శాస్త్రి క్యాచ్ ఔటయ్యాడు.

కెప్టెన్‌గా చేయనందుకు క్షమించండి..

షేన్ వార్న్ తన చివరి టెస్టును జనవరి 2007లో ఆడాడు. 1999లో, అతను ఆస్ట్రేలియాకు వైస్ కెప్టెన్‌గా కూడా అయ్యాడు. కానీ, అతనికి కెప్టెన్‌గా అవకాశం రాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, వార్న్ తొలిసారిగా ఐపీఎల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

వార్న్ కెరీర్ అంతా వివాదాస్పదమే..

2000లో, బ్రిటీష్ నర్సు డోనా రైట్, వార్న్ అసభ్యకరమైన సందేశాలను పంపాడని ఆరోపించింది. దీని తర్వాత, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వార్న్ నుంచి వైస్ కెప్టెన్సీని తొలగించింది. వార్న్ చాలా మంది మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని, దాని కారణంగా అతని భార్య సిమోనా అతని నుంచి విడాకులు తీసుకుంది.

వార్న్‌ని భయపెట్టిన సచిన్..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సచిన్ తన కలలో కూడా సిక్సర్లు కొట్టి భయపెట్టేవాడని వార్న్ ఓ సందర్భంలో వెల్లడించాడు. 1998లో షార్జాలో వార్న్ వేసిన బంతులను సచిన్ బౌండరీలు తరలించాడు.