Champions Trophy: రోజా విషయంలో షమీకి పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ నీతులు! అతను ఇన్‌డైరెక్ట్‌.. మనోళ్లు డైరెక్టేగానే..

భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో షమీ నీళ్లు తాగడంపై వివాదం చెలరేగింది. ఉపవాసం పాటించలేదని విమర్శలు వచ్చాయి. షోయబ్ అక్తర్ పరోక్షంగా షమీపై విమర్శలు చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. అయితే, భారత అభిమానులు అక్తర్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వివాదం ఇండియా-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మరింత వేడిని పెంచింది.

Champions Trophy: రోజా విషయంలో షమీకి పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ నీతులు! అతను ఇన్‌డైరెక్ట్‌.. మనోళ్లు డైరెక్టేగానే..
Shami Akhtar

Updated on: Mar 08, 2025 | 10:06 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా రేపు(మార్చి్‌ 9, ఆదివారం) భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. కొన్ని కళ్లు మాత్రం షమీ రేపు నీళ్లు తాగుతాడా? లేదా? అని కళ్లలో ఒత్తులేసుకొని చూస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా షమీ నీళ్లు తాగడంపై పెద్ద దుమారమే చెలరేగింది.  పవిత్ర రంజాన్‌ మాసంలో షమీ రోజా(ఉపవాసం) పాటించలేదని, అతను పేరుకు మాత్రమే ముస్లిం అంటూ కొంతమంది విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో షమీ కుటుంబ సభ్యులు షమీకి మద్దతుగా నిలిచారు. అలాగే చాలా మంది నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు షమీకి సపోర్ట్‌ చేశారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిని పట్టుకొని, రోజా పాటించడం లేదంటూ చిల్లర విమర్శలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. అయితే ఇదే విషయంపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఇన్‌డైరెక్ట్‌గా రికార్డ్‌ అయ్యాడు. భారత్‌, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత షమీపై విమర్శలు వచ్చిన తర్వాత అక్తర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. ఫిట్‌నెస్‌ కోసం శారీరక వ్యాయామం చేసిన తర్వాత చెమటతో నిండిన తన టీషర్ట్‌ను పిండుతూ.. కనిపించాడు.

ఆ వీడియోకు “రోజా ఎక్స్‌క్యూజ్‌ కాదు. అది ఒక ప్రేరణ. ట్రైనింగ్‌లో పాల్గొనకుండా మిమ్మల్ని ఏదీ ఆపకూడదు. దానిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి.” అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇది ఇన్‌డైరెక్ట్‌గా షమీకి కౌంటర్‌ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అక్తర్‌పై విమర్శలు చేస్తున్నారు. రోజా ఉన్నాం కదా అని ట్రైనింగ్‌కి వెళ్లకుండా ఉండొద్దంటూనే, ట్రైనింగ్‌ లేదా గేమ్‌ కోసం రోజాను కూడా విడిచిపెట్టొద్దంటూ పరోక్షంగా షమీకి సెటైర్లు వేశాడు ఈ మాజీ పేసర్‌. దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్‌ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించినా, ఇండియన్‌ ఫ్యాన్స్‌ మాత్రం డైరెక్ట్‌గానే అక్తర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆట విషయంలో ఏం చేయలేక ఇలా మతం విషయంలో నీతులు చెబుతున్నారా? అంటూ అక్తర్‌ను ఏకిపారేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.