
Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి ఆస్ట్రేలియా గడ్డపై గట్టి షాక్ తగిలింది. బిగ్ బాష్ లీగ్‌లో మెరుపులు మెరిపిద్దామని వెళ్లిన ఈ స్పీడ్‌స్టర్, అనూహ్యంగా గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకు అతను ఆస్ట్రేలియాను వీడి స్వదేశానికి బయలుదేరాడు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
బ్రిస్బేన్ హీట్ జట్టు తరపున ఆడుతున్న షాహీన్ అఫ్రిదీకి, డిసెంబర్ 27న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయమైంది. బౌలింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్లో అతని కుడి మోకాలికి తీవ్రమైన నొప్పి రావడంతో, అతను మైదానంలోనే కుంటుతూ కనిపించాడు. కనీసం తన ఓవర్‌ను కూడా పూర్తి చేయలేక మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. మోకాలి గాయం తీవ్రతను గమనించిన పీసీబీ, అతనికి సరైన చికిత్స అందించేందుకు వెంటనే పాకిస్థాన్‌కు తిరిగి రావాలని కోరింది.
తన నిష్క్రమణపై షాహీన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “బ్రిస్బేన్ హీట్ టీమ్, ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఊహించని గాయం వల్ల బోర్డు నన్ను వెనక్కి పిలిచింది. త్వరలోనే మళ్ళీ మైదానంలోకి వస్తానని ఆశిస్తున్నాను. అప్పటి వరకు నా టీమ్‌కు బయట నుంచే మద్దతు ఇస్తాను” అని పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో జరగబోయే వరల్డ్ కప్ నాటికి షాహీన్ ఫిట్‌నెస్ పాక్ జట్టుకు చాలా కీలకం. అందుకే పీసీబీ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించనున్నారు.
BREAKING: Shaheen Afridi will miss the remainder of #BBL15 due to a knee injury. pic.twitter.com/dY5Btfn396
— KFC Big Bash League (@BBL) December 30, 2025
నిజానికి ఈసారి బిగ్ బాష్ లీగ్ షాహీన్ అఫ్రిదీకి అస్సలు కలిసిరాలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. పైగా అతని ఎకానమీ రేటు 11.19గా ఉంది, అంటే బ్యాటర్లు అతడిని చితక్కొట్టారు. డెబ్యూ మ్యాచ్‌లోనే వరుసగా రెండు బీమర్లు (హై ఫుల్ టాస్) వేసినందుకు అంపైర్లు అతడిని బౌలింగ్ నుంచి తొలగించారు. ఆరంభంలోనే అపశ్రుతి ఎదురైన షాహీన్, ఇప్పుడు గాయంతో సీజన్ మొత్తానికి దూరం కావడం అతని ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..