Shafali Verma: తగ్గేదే లే అంటున్న షెఫాలీ వర్మ.. కొత్త రోల్లో చెలరేగిపోవడానికి డైనమైట్ రెడీ
Shafali Verma: భారత మహిళల క్రికెట్లో యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మకు కొత్త బాధ్యతలు దక్కాయి. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఆమె.. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు తొలిసారి మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీ మార్పు, తన రీఎంట్రీ, బౌలింగ్‌పై ఆసక్తి, యువ ఆటగాళ్లకు అవకాశాలపై కీలక విషయాలు వెల్లడించారు.

Shafali Verma: భారత మహిళా టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యంగ్ సంచలనం షెఫాలీ వర్మ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం (అక్టోబర్ 16) నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కీలక విషయాలను పంచుకున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో జరగబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ప్రతి మ్యాచ్‌లోనూ భయం లేని, వ్యూహాత్మకమైన ఆటతీరును ప్రదర్శిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశం తొలిసారిగా జింబాబ్వేతో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతుండటం గమనార్హం. రాయ్‌పూర్‌లో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్ కోసం వడోదరా వెళ్లనున్నాయి.
కెప్టెన్సీ మార్పు, కొత్త బాధ్యతలు
హర్మాన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భారత మహిళా జట్టు అన్ని ఫార్మాట్లకు స్మృతి మంధానను కొత్త కెప్టెన్ గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో షెఫాలీ వర్మకు వైస్ కెప్టెన్సీ దక్కగా, వన్డే ఫార్మాట్‌కు దీప్తి శర్మకు బాధ్యతలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్‌ను షెఫాలీ కొనియాడారు. భారత మహిళా క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడంలో హర్మాన్ పాత్ర అపారమైనదని, ఈ రోజు మహిళల క్రికెట్ ఉన్న స్థానానికి ఆమె కృషి ఎంతో ఉందో చెప్పారు. జట్టులో ప్రణాళికాబద్ధమైన సమావేశాలు జరిగాయని, ప్రతీ క్రీడాకారిణికి తమ పాత్రపై స్పష్టమైన అవగాహన ఉందని షెఫాలీ తెలిపారు.
కష్టకాలం నేర్పిన పాఠాలు
గతంలో కొంతకాలం పాటు జాతీయ జట్టుకు దూరమైన రోజులను గుర్తుచేసుకుంటూ షెఫాలీ తన రీఎంట్రీ గురించి వివరించారు. జట్టులో చోటు కోల్పోయిన సమయంలో తన ఆటతీరును విశ్లేషించుకున్నానని తెలిపారు. బ్యాటింగ్‌లో స్థిరత్వం, ఫిట్నెస్ అలాగే మానసిక బలాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కష్టపడ్డానని చెప్పారు. ఆ కష్టమే ఇప్పుడు సరైన ఫలితాలను ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన ఆమె, ఇప్పుడు ఆల్‌రౌండర్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. 2021 నుంచే హర్యానా తరఫున బౌలింగ్ చేస్తున్నానని, భవిష్యత్తులో టీమిండియాకు బౌలింగ్ చేయాల్సి వస్తే ఎలా సిద్ధపడాలో మానసికంగా ముందే ప్రణాళికలు వేసుకున్నానని వెల్లడించారు.
కొత్త ఆటగాళ్లకు అవకాశాలు
గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ గైర్హాజరీపై స్పందిస్తూ, జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని షెఫాలీ పేర్కొన్నారు. ఆసియా కప్, ఏషియన్ గేమ్స్ పోటీల్లో జెమిమా లేకపోయినప్పటికీ రిచా ఘోష్, హర్మాన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా రాణించారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా జట్టులోకి వచ్చిన నికీ ప్రసాద్ వంటి యువ ఆటగాళ్లకు మిడిలార్డర్లో అవకాశాలు ఇస్తూ, జట్టును మరింత బలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జింబాబ్వేతో జరగబోయే ఈ సిరీస్ ద్వారా ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతామని భారత వైస్ కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
