
U19 Asia Cup Final: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో పాకిస్థాన్ కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే నిర్ణయాన్ని తలకిందులు చేస్తూ పాక్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. దాయాది దేశాల మధ్య జరిగే ఫైనల్ కావడంతో మ్యాచ్ ఆరంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్నప్పటికీ పాక్ ఓపెనర్ల దూకుడు ముందు అది సరిపోవడం లేదు.
ఈ మ్యాచ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ గురించి. ఆది నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సమీర్, కేవలం 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఈ టోర్నీలో అతనికి రెండో సెంచరీ కావడం విశేషం. సమీర్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో స్టేడియం నలుమూలలా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు అతడికి ఉస్మాన్ ఖాన్ నుంచి మంచి సపోర్టు లభించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.
భారత్ విషయానికి వస్తే, ఫీల్డింగ్‌లో జరిగిన పొరపాట్లు జట్టుకు శాపంగా మారాయి. ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఖిలన్ పటేల్ జారవిడవడం మ్యాచ్ మలుపు తిప్పింది. ఆ తర్వాత ఖిలన్ పటేల్ 17వ ఓవర్లో ఉస్మాన్‌ను అవుట్ చేసి వికెట్ల వేట ప్రారంభించినప్పటికీ, అప్పటికే పాకిస్థాన్ పటిష్టమైన స్థితికి చేరుకుంది. మొదటి వికెట్‌ను నాలుగో ఓవర్లోనే హెనిల్ పటేల్ తీసి శుభారంభం ఇచ్చినా, దాన్ని టీమిండియా కొనసాగించలేకపోయింది. మిడిల్ ఓవర్లలో పాక్ బ్యాటర్లు ఎక్కడా వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పెంచారు.
ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు బోర్డు 300 మార్కును సులువుగా దాటేలా కనిపిస్తోంది. 31 ఓవర్లు ముగిసేసరికి పాక్ 2 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రన్ రేట్ చూస్తుంటే పాకిస్థాన్ 320కి పైగా పరుగులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్, అదే మ్యాజిక్‌ను ఇక్కడ రిపీట్ చేయాలంటే డెత్ ఓవర్లలో అద్భుతం చేయాల్సిందే. కనీసం 280 పరుగుల లోపు పాకిస్థాన్‌ను కట్టడి చేస్తేనే భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేదంటే భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..