వరల్డ్ కప్ 2019: పసికూన అఫ్గనిస్తాన్‌పై జరిగిన పోరులో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీలు ఆటతీరు నిరాశపరచిందని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో టీమిండియా మిడిలార్డర్ తడబడింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు నష్టపోయి 224పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీనిపై స్పందించిన సచిన్ ‘కాస్త నిరుత్సాహానికి గురయ్యాను. ఇంకొంచెం మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే బాగుండేది. కేదర్ జాదవ్- మహేంద్ర సింగ్ ధోనీల భాగస్వామ్యం చాలా నెమ్మెదిగా సాగింది. దీనిపై అస్సలేం సంతోషంగా లేను. 34ఓవర్లు స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని మనం చేసింది 119పరుగులు మాత్రమే. ఇది అస్సలేం బాగాలేదు. కోహ్లీ అవుట్ అయిన 38ఓవర్ నుంచి 45వ ఓవర్ వరకూ మనం పెద్దగా పరుగులు చేయలేదు. మిడిలార్డర్ పై ఒత్తిడి ఉండటం సహజమే. కానీ, దానిని అధిగమించాలి. కేదర్ జాదవ్ ఇంకా అంతే ఒత్తిడిని ఫీల్ అవుతున్నాడు. ఆ స్థానంలో వేరెవరైనా ఉంటే బాగుండేమోననిపిస్తోంది’ అని వెల్లడించాడు.