SA20 League 2025 : గంగూలీకి మళ్ళీ షాక్..కావ్య మారన్ సేన రచ్చ రంబోలా..సన్‌రైజర్స్ ధాటికి ప్రిటోరియా విలవిల

SA20 League 2025 : టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5) త్వరగానే అవుట్ అయినా.. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

SA20 League 2025 : గంగూలీకి మళ్ళీ షాక్..కావ్య మారన్ సేన రచ్చ రంబోలా..సన్‌రైజర్స్ ధాటికి ప్రిటోరియా విలవిల
Sa20 League 2025

Updated on: Dec 30, 2025 | 3:20 PM

SA20 League 2025 : సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న SA20 లీగ్ 2025-26 సీజన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తాజాగా ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 48 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, బోనస్ పాయింట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రිටోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీకి మరోసారి నిరాశే ఎదురైంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ శివాలెత్తాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 77 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి తోడుగా మ్యాథ్యూ బ్రీట్జ్కే (52) హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో జోర్డాన్ హెర్మన్ (37) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలోనే కేవలం 140 పరుగులకు ఆలౌట్ అయింది. షాయ్ హోప్ (36), విల్ స్మీద్ (35) మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 4 వికెట్లతో చెలరేగగా.. మార్కో యాన్సెన్, రత్నాయకేలు కీలక వికెట్లు పడగొట్టి ప్రිටోరియా పతనాన్ని శాసించారు.

ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీకి ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఘోర ఓటములను చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోగా, ఇప్పుడు కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ చేతిలో చిత్తయింది. మరోవైపు వరుస విజయాలతో 10 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..