Video: తొలి టెస్టులో అరంగేట్రం.. తొలి బంతికే వికెట్.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన అశ్విన్ మాజీ ఫ్రెండ్

|

Dec 27, 2024 | 12:44 PM

SA vs PAK: దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో, ఆఫ్రికా అంతర్జాతీయ అరంగేట్ర ఆటగాడు కార్బిన్ బాష్ తన మొదటి బంతికే వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన ఆఫ్రికా తొలి పేసర్‌గా నిలిచాడు.

Video: తొలి టెస్టులో అరంగేట్రం.. తొలి బంతికే వికెట్.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన అశ్విన్ మాజీ ఫ్రెండ్
Sa Vs Pak Corbin Bosch
Follow us on

ఓ వైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా, మరోవైపు మరో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడుతున్నాయి. రెండు జట్ల మధ్య డిసెంబర్ 26న ప్రారంభమైన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాక్‌ టాస్‌ ఓడి తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. తొలిరోజు ముగిసే సరికి పాక్ జట్టు 211 పరుగులకు ఆలౌట్ అయింది. అలాగే, సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. కాగా, ఆఫ్రికా తరపున తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న ఫాస్ట్‌ బౌలర్‌ కార్బిన్‌ బోష్‌.. కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి చరిత్ర సృష్టించాడు.

పాకిస్థాన్‌కు శుభారంభం..

సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టుకు ఓపెనింగ్ జోడీ శుభారంభం అందించింది. ఇలా వికెట్ కోసం తహతహలాడుతున్న ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా.. కగిసో రబడా, అనుభవజ్ఞుడైన స్పీడ్ స్టర్ మార్కో జాన్సన్ వంటి జట్టు ప్రధాన బౌలింగ్ అస్త్రాలను ఉపయోగించి ఒకరి వెనుక ఒకరు బౌలింగ్ చేసినా వికెట్ దక్కలేదు.

ఇవి కూడా చదవండి

తొలి బంతికే వికెట్‌..

దీంతో మ్యాచ్‌ ప్రారంభమైన తొలి గంటలో దక్షిణాఫ్రికాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. బౌలింగ్ లో మార్పు చేసిన బావుమా.. పేసర్ డాన్ ప్యాటర్సన్‌కు బంతి అందించాడు. అయినా జట్టుకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత 15వ ఓవర్లో బౌలింగ్‌లో మరో మార్పు చేసిన బావుమా.. టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్న పేసర్ కార్బిన్ బాష్‌ను ఆహ్వానించాడు. కెప్టెన్‌ పిలుపుతో బంతి అందుకున్న కార్బిన్ బాష్.. తాను వేసిన తొలి బంతికే పాక్ కెప్టెన్ మసూద్ వికెట్ పడగొట్టి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు.

ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా..

దీంతో అరంగేట్రం టెస్టులో తొలి బంతికే వికెట్‌ తీసిన ఐదో దక్షిణాఫ్రికా బౌలర్‌గా కార్బిన్ బోష్ నిలిచాడు. అతని కంటే ముందు, బెర్ట్ వోగ్లర్ (1906), డాన్ పీట్ (2014), హర్డస్ విల్హౌన్ (2016), త్షెపో మోరేకి (2024) అరంగేట్రం టెస్టులో మొదటి బంతికే వికెట్‌తీశారు. కానీ, బాష్ తొలి వికెట్ చరిత్రాత్మకమైనది. ఎందుకంటే, బాక్సింగ్ డేలో అరంగేట్రం చేసిన ఒక పేసర్ అతను వేసిన మొదటి బంతికే వికెట్ తీయడం దక్షిణాఫ్రికా తరపున 135 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. తద్వారా దక్షిణాఫ్రికా జట్టుకు టెస్టు క్రికెట్‌లో బాష్ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఆ తర్వాత కూడా తన వికెట్ల కోసం వేట కొనసాగించిన బోష్.. 4 వికెట్లు పడగొట్టి, పాక్ జట్టు పతనాన్ని శాసించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..