టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్ మళ్లీ రెచ్చిపోయాడు. గురువారం (డిసెంబర్ 14) జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం ధాటిగా ఆడిన మిస్టర్ 360 ప్లేయర్ కేవలం 55 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్యకు తోడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 12 పరుగుల వద్ద అవుటవ్వగా, తిలక్ వర్మ సున్నాకి అవుటయ్యాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా జైస్వాల్ దూకుడగా ఆడాడు. కేవలం 41 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. మొదట నెమ్మదిగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా కేవలం 55 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీ సాధించిన రోహిత్ శర్మ రికార్డును సూర్యకుమార్ యాదవ్ సమం చేశాడు. టీ20 క్రికెట్‌లో హిట్‌మన్ 4 సెంచరీలు చేశాడు.
ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా టీ20 క్రికెట్‌లో 4 సెంచరీలు చేయడం ద్వారా రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును సమం చేశాడు. అంతే కాకుండా అతి తక్కువ టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఉండేది. గ్లెన్ మాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల ద్వారా 4 టీ20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు సీడీసీ సూర్యకుమార్ యాదవ్ కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే 4 అద్భుత సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సూర్యకుమార్ యాదవ్ (100) సెంచరీతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 202 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా దక్షిణాఫ్రికాపై సూర్యకుమార్ కు ఇదే తొలి సెంచరీ. విశేషమేమిటంటే అతని ఈ సెంచరీలన్నీ వివిధ దేశాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా మరియు దక్షిణాఫ్రికా) వచ్చాయి. 56 బంతుల్లో (8 సిక్సర్లు, 7 ఫోర్లు) 100 పరుగులు చేసి ఔటయ్యాడు సూర్య.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..