Ruturaj Gaikwad : టీమిండియాలోకి తీసుకోలేదనే కసితో కొట్టాడా? 15వ సెంచరీలతో నయా చరిత్ర

Ruturaj Gaikwad : గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో కేవలం 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(15) చేసిన ఆటగాడిగా అంకిత్ బావనే రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్(13), మయాంక్ అగర్వాల్(13)ల కంటే గైక్వాడ్ ఇప్పుడు ముందున్నాడు.

Ruturaj Gaikwad : టీమిండియాలోకి తీసుకోలేదనే కసితో కొట్టాడా? 15వ సెంచరీలతో నయా చరిత్ర
Ruturaj Gaikwad

Updated on: Jan 08, 2026 | 2:19 PM

Ruturaj Gaikwad : టీమిండియా స్టార్ ఓపెనర్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సెలక్ట్ కానప్పటికీ ఆ కసిని బ్యాట్ ద్వారా చూపిస్తూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ఏడవ రౌండ్‌లో గోవాతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అటు భారత్‌లోనూ, ఇటు ప్రపంచ క్రికెట్‌లోనూ అత్యంత అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

గోవాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర పరిస్థితి ఒక దశలో చాలా దారుణంగా తయారైంది. కేవలం 2 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కొద్దిసేపటికే సగం టీమ్(5 వికెట్లు) కేవలం 25 పరుగులకే పెవిలియన్ చేరింది. ఆరో వికెట్ 52 పరుగుల వద్ద పడటంతో మహారాష్ట్ర 100 పరుగులు కూడా దాటడం కష్టమని అందరూ భావించారు. కానీ కెప్టెన్ గైక్వాడ్ పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. విక్కీ ఓస్త్వాల్‌(53)తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.

గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో కేవలం 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(15) చేసిన ఆటగాడిగా అంకిత్ బావనే రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో దేవదత్ పడిక్కల్(13), మయాంక్ అగర్వాల్(13)ల కంటే గైక్వాడ్ ఇప్పుడు ముందున్నాడు. ఈ ఇన్నింగ్స్ సాయంతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది.

ఈ సెంచరీతో గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో(వన్డే ఫార్మాట్) తన 5000 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవన్ పేరిట ఉన్న 58.59 సగటు రికార్డును గైక్వాడ్ అధిగమించాడు. ప్రస్తుతం గైక్వాడ్ సగటు 58.83 వద్ద ఉంది. ప్రపంచంలోనే వన్డే ఫార్మాట్‌లో ఇంతటి నిలకడగా పరుగులు సాధిస్తున్న మరో బ్యాటర్ లేకపోవడం గమనార్హం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.