
Rohit Sharma ODI Captaincy Row: భారత క్రికెట్‌లో కెప్టెన్ల మార్పు ఎప్పుడూ చర్చనీయాంశమే. అయితే, రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించడంపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారని ఆయన స్పష్టం చేశాడు.
ఒక క్రీడా ఛానల్‌తో మాట్లాడిన మనోజ్ తివారీ.. “అజిత్ అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడడు. కానీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాడి విషయంలో ఇంత పెద్ద సాహసం అతను ఒక్కడే చేయలేడు. దీని వెనుక ఖచ్చితంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనలు ఉండి ఉంటాయి. వీరిద్దరూ కలిసే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు” అని ఆరోపించాడు.
ఐసీసీ టోర్నీల్లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌ను ఇలా అర్ధాంతరంగా తొలగించడం రోహిత్‌ను అవమానించడమేనని తివారీ అభిప్రాయపడ్డాడు. “వరల్డ్ కప్ 2027 వరకు రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటాడో లేదో అని సెలక్టర్లు అనుమానించడం సరికాదు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డు ఉన్న ఆటగాడి సామర్థ్యాన్ని శంకించడం పొరపాటు” అని పేర్కొన్నాడు.
ప్రస్తుత భారత తుది జట్టు (Playing XI) ఎంపికలో చాలా లోపాలు ఉన్నాయని తివారీ విమర్శించాడు. బౌలర్ల ఎంపిక, ఆటగాళ్ల మార్పుల విషయంలో అసమానతలు ఉండటం వల్ల తనకు వన్డే క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
రోహిత్ శర్మను కేవలం బ్యాటర్‌గా పరిమితం చేసి, గిల్‌ను కెప్టెన్ చేయడం టీమ్ ఇండియా భవిష్యత్తుకు ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే, సెలక్టర్ల ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..