
Rohit Virat : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా తరపున కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ ఇద్దరూ ఇటీవల భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఈ సూపర్‌స్టార్లను మళ్లీ ఎప్పుడు మైదానంలో చూడవచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి అభిమానులు పెద్దగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మళ్లీ భారత జెర్సీలో చూడటానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పని లేదు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఇద్దరు సూపర్‌స్టార్‌లు మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. భారత జట్టు జనవరి 2026లో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను స్వదేశంలో ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 11న వడోదరలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్ ఆడటం దాదాపుగా ఖాయమైంది.
అంతర్జాతీయ సిరీస్‌కు ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు దేశవాళీ క్రికెట్‌లో తమ ఫామ్‌ను కొనసాగించుకోవాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 18, 2026 వరకు జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్-A టోర్నమెంట్)లో వీరిద్దరూ పాల్గొనే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తన లభ్యత గురించి తెలియజేశారు. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా ముంబై జట్టు తరపున ఆడటానికి పూర్తిగా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ దేశవాళీ టోర్నమెంట్‌లో ఆడటం ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్‌ను, అలాగే ఫామ్‌ను కొనసాగించుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఈ దిగ్గజాలు చాలా ఏళ్ల తర్వాత ఆడుతుండటం విశేషం. కోహ్లీ చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడింది 16 సంవత్సరాల క్రితం 2010లో. విరాట్ 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ తరపున 13 మ్యాచ్‌లు ఆడి, 4 సెంచరీలతో సహా 819 పరుగులు చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఈ టోర్నమెంట్‌లో కనిపించనుండటం అభిమానులకు పండుగే. రోహిత్ శర్మ చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో అక్టోబర్ 17, 2018న ఆడాడు. కాబట్టి రోహిత్‌కు కూడా ఈ టోర్నమెంట్ చాలా ప్రత్యేకంగా నిలవనుంది.