Rohit – Virat : స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్ ల వన్డే విశ్వరూపం!

Rohit - Virat : 2026లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొత్తం 18 వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో భారీగా వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్‌లతో కూడిన పూర్తి షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.

Rohit - Virat : స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్ ల వన్డే విశ్వరూపం!
Rohit Sharma Virat Kohli

Updated on: Dec 31, 2025 | 3:15 PM

Rohit – Virat : టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు 2026 సంవత్సరం అదిరిపోయే విందును అందించబోతోంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ రన్ మెషీన్లు.. వచ్చే ఏడాదిలో భారీగా వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వీరు వచ్చే ఏడాది మొత్తం 18 వన్డే మ్యాచ్‌లలో మైదానంలో మెరిసే అవకాశం ఉంది.

ప్రపంచ కప్ దిశగా అడుగులు

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, విరాట్ ఇప్పుడు తమ పూర్తి దృష్టిని వన్డే ఫార్మాట్‌పైనే పెట్టారు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అదరగొట్టిన వీరు, ఫామ్ కోల్పోకుండా ఉండటానికి విజయ్ హజారే ట్రోఫీలో కూడా మెరిశారు. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి తమను తాము పక్కాగా సిద్ధం చేసుకోవడానికి 2026లో జరిగే సిరీస్‌లు వారికి కీలకం కానున్నాయి.

ఏడాది ఆరంభమే న్యూజిలాండ్‌తో

2026 జనవరిలోనే కివీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌తోనే రో-కో జోడీ తమ పరుగుల వేటను ప్రారంభించనుంది.

జనవరి 11: మొదటి వన్డే (వడోదర)

జనవరి 14: రెండో వన్డే (రాజ్‌కోట్)

జనవరి 18: మూడో వన్డే (ఇండోర్)

ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సవాళ్లు

జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించి మూడు వన్డేలు ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూలైలో ఇంగ్లండ్ గడ్డపై జరిగే మూడు వన్డేలు రోహిత్, విరాట్‌లకు గట్టి పరీక్ష కానున్నాయి.

జూలై 14: మొదటి వన్డే (బర్మంగ్‌హామ్)

జూలై 16: రెండో వన్డే (కార్డిఫ్)

జూలై 19: మూడో వన్డే (లండన్)

వెస్టిండీస్, కివీస్, శ్రీలంకతో పోరు

సెప్టెంబర్-అక్టోబర్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌కు రానుండగా.. అక్టోబర్-నవంబర్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ మరో మూడు వన్డేలు ఆడుతుంది. ఇక 2026 ఏడాది చివరలో డిసెంబర్‌లో శ్రీలంకతో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో ఈ బిజీ షెడ్యూల్ ముగుస్తుంది. మొత్తంగా 6 ద్వైపాక్షిక సిరీస్‌లలో కలిపి 18 వన్డేలు ఆడేందుకు ఈ ఇద్దరు దిగ్గజాలు రెడీ అవుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..