IND vs WI T20 World Cup 2026 : అదే స్కోరు.. అదే విండీస్.. పదేళ్ల తర్వాత తీరిన పాత బాకీ

IND vs WI T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పట్టవచ్చు కానీ, తీర్చుకున్నప్పుడు మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా టీమిండియా సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది.

IND vs WI T20 World Cup 2026 : అదే స్కోరు.. అదే విండీస్.. పదేళ్ల తర్వాత తీరిన పాత బాకీ
Ind Vs Wi Playing Xi

Updated on: Mar 02, 2026 | 7:20 AM

IND vs WI T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పట్టవచ్చు కానీ, తీర్చుకున్నప్పుడు మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా టీమిండియా సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది. అది కూడా వెస్టిండీస్ మనల్ని ఏ విధంగానైతే దెబ్బకొట్టిందో, అదే స్టైల్‌లో వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల గుండెల్లో పదేళ్లుగా దాగి ఉన్న ఓటమి గాయానికి మందు లాంటిది. ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ సెమీఫైనల్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. అప్పుడు భారత్ మొదట బ్యాటింగ్ చేసి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతా భారత్ గెలుస్తుందని ధీమాగా ఉన్న వేళ, వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి 19.4 ఓవర్లలోనే 196 పరుగులు చేసి మనల్ని టోర్నీ నుంచి బయటకు పంపారు. ఆ రోజు భారతీయుల కళ్లలో నీళ్లు తిరిగిన క్షణాలను ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత వెస్టిండీస్ ఫైనల్‌కు వెళ్లి కప్పు కూడా గెలిచింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పదేళ్ల తర్వాత అదే వెస్టిండీస్‌కు విధి తనదైన శైలిలో శిక్ష విధించింది.

ప్రస్తుత 2026 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి మళ్ళీ అదే 195 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. భారత్ గెలవాలంటే సరిగ్గా 196 పరుగులు కావాలి. చిత్రమేమిటంటే 2016లో వెస్టిండీస్ మనల్ని ఓడించడానికి చేసిన పరుగులు కూడా 196. ఈసారి టీమిండియా ఏమాత్రం తడబడలేదు. సంజూ శాంసన్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ (97 నాటౌట్)తో విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారత్ కేవలం 19.2 ఓవర్లలోనే 199 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. పదేళ్ల క్రితం వారు మనల్ని సెమీస్ చేరకుండా అడ్డుకుంటే, ఈరోజు భారత్ వారిని ఓడించి టోర్నీ నుంచే పంపించి పగ తీర్చుకుంది.

ఈ విజయం తర్వాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. ఆకాశంలో టపాసుల వెలుగులు, స్టేడియం అంతా మార్మోగిన వందేమాతరం నినాదాలు ఒక పండుగ వాతావరణాన్ని తలపించాయి. లేజర్ లైట్స్ షోతో అభిమానులు పిచ్చెక్కిపోయారు. టీమిండియా డగౌట్‌లో ఆటగాళ్లు ఒకరినొకరు హత్తుకుని ఈ చారిత్రాత్మక క్షణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పదేళ్ల క్రితం వాంఖెడేలో మొదలైన బాధాకరమైన కథ, నేడు ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుతమైన విజయంతో సుఖాంతమైంది. ఇప్పుడు టీమిండియా తన తదుపరి పోరులో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ తలపడనుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us