ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ తరపున వనిందు హసరంగా, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ముంబై కేవలం 79 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఓ దశలో జట్టు 100 పరుగుల మార్క్‌ను దాటడం కష్టమే అని అనిపించింది. అయితే ఏడో వికెట్‌కు, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు 41 బంతుల్లో అజేయంగా 72 పరుగులు జోడించారు. సూర్య 68, ఉనద్కత్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
హస్రంగ ఖాతాలో 2 వికెట్లు..
వనిందు హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టాడు. డెవాల్డ్ బ్రెవిస్ (8), కీరన్ పొలార్డ్ (0)లను ఔట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి, రెండో స్థానంలో నిలిచాడు.
62 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ముంబై..
ముంబై 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోగా, 62 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగుల వద్ద రోహిత్ శర్మను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (26)ను ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 8 పరుగుల వద్ద హస్రంగ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తిలక్ వర్మ (0)ను మ్యాక్స్ వెల్ రనౌట్ చేయగా, కీరన్ పొలార్డ్ ఖాతా తెరవకుండానే హస్రంగ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఐపీఎల్‌లో పొలార్డ్ ఆరోసారి సున్నాకే ఔట్..
టీ20 ఫార్మాట్‌లో పొలార్డ్‌ను హసరంగ మూడోసారి ఔట్ చేశాడు. రమణదీప్ సింగ్ 12 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఐపీఎల్‌లో తన రెండో మ్యాచ్‌లో ఆడిన బేబీ ఏబీ (డెవాల్డ్ బ్రెవిస్) 11 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడిని వనిందు హసరంగా ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో KKRతో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో అతను 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు.
హర్షల్ చేతిలో మూడోసారి ఔటైన హిట్‌మ్యాన్..
మంచి లయలో కనిపించిన రోహిత్ శర్మ 15 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని వికెట్ హర్షల్ పటేల్ ఖాతాలో చేరింది. ఐపీఎల్‌లోని 6 ఇన్నింగ్స్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. అందులో హర్షల్ రోహిత్‌ను మూడుసార్లు అవుట్ చేశాడు.
ఎంఐ తరఫున 400 బౌండరీలు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ..
విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ), సురేష్ రైనా (సీఎస్‌కే) తర్వాత ఐపీఎల్‌లో ఏదైనా ఒక ఫ్రాంచైజీకి 4500 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ముంబై తరఫున అతను 4521 పరుగులు చేశాడు. అలాగే ఎంఐ తర్వాత 403 బౌండరీలు బాదిన ఆటగాడిగా మారాడు.