IPL 2025: ఈ సారి RCBని అడ్డుకోగలరా? ప్లేయింగ్ 11 చూస్తే వణుకు పుట్టాల్సిందే!
RCB ఐపీఎల్ లో అత్యధిక అభిమానం ఉన్న జట్టు, అయితే ఇప్పటివరకు ట్రోఫీ గెలవలేదు. ఈ సారి బలమైన బ్యాటింగ్, మెరుగైన బౌలింగ్ తో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ, నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం, ప్లేయింగ్ ఎలెవెన్ ఎంపిక సవాళ్లు. కోహ్లీ, పాటీదార్, సాల్ట్, భువి వంటి ఆటగాళ్ళు కీలకం.

ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ ఆర్సీబీ. కానీ.. గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదని ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆర్సీబీతో పాటు ఢిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఇప్పటి వరకు ట్రోఫీ కొట్టకపోయినా.. వాటి కంటే చాలా ఎక్కువ ఆర్సీబీనే ట్రోల్ చేస్తుంటారు. అందుకే కారణం ఆర్సీబీకి ఉన్న క్రేజే. అయితే ఈ సారి ఎందుకో ఆర్సీబీ ట్రోఫీ లేదనే ముద్రను చెరిపేసుకునేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ టీమ్ ఈ సారి చాలా బాగా సెట్ అయినట్లు ఉంది. ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆర్సీబీ.. ఒక్కసారి టోర్నీ మొదలైతే తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆర్సీబీ అసలు బలం ఏంటి? ఏ ఏరియాలో వీక్‌గా కనిపిస్తోంది? జట్టులో ఏ ఆటగాళ్లు కీలకం? ఎవరిపై ఆశలు పెట్టుకోవచ్చు? ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? ఆర్సీబీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే చిన్న స్వామి స్టేడియంలో వాళ్ల రికార్డ్ ఎలా ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
ముందుగా ఆర్సీబీ బలం విషయానికి వస్తే.. బ్యాటింగ్ అని చెప్పాలి. ఇప్పుడే కాదు.. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ల బలం బ్యాటింగే. ఎందుకంటే చిన్న స్వామి స్టేడియం చిన్నిది, బ్యాటింగ్ పిచ్ కావడంతో ఎక్కువగా బ్యాటర్లపైనే ఆ టీమ్ ఆధారపడుతూ వస్తోంది. ఈ సారి కూడా బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. ఎట్ ది సేమ్ టైమ్.. ఈ సారి వాళ్ల బౌలింగ్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. చిన్న స్వామి స్టేడియంలో పరుగులు కంట్రోల్ చేయడం కష్టం. అదే ప్రతిసారి ఆర్సీబీకి ఇబ్బందిగా మారేది. కానీ, ఈ సారి వాళ్లు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువన్వేశర్ కుమార్‌ను తీసుకొచ్చారు. యష్ దయాల్ ఉండనే ఉన్నాడు. అలాగే జోస్ హెజల్‌వుడ్, నుమాన్ తుషారా, లుంగి ఎన్గిడి వంటి బౌలర్లను టీమ్‌లోకి తీసుకున్నారు.
వీరితో పాటు కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, స్వప్నిల్ సింగ్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. సో.. ఓవరాల్‌గా ఈ సారి ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ చాలా బాగుంది. ఇక బ్యాటింగ్‌లో విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ కొండంత అండ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిలబడ్డాడా.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించేస్తాడు. ఇక కోహ్లీతో పాటు ఈ సారి ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్‌తో కూడిన మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. మరీ ముఖ్యంగా యంగ్ కెప్టెన్ రజత్ పాటీదార్ ఉండనే ఉన్నాడు. అలాగే జితేష్ శర్మ, స్వస్తిక్ చికారా లాంటి ఇండియన్ టాలెంట్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. సో.. ఎప్పటిలాగే బ్యాటింగ్‌లో ఆర్సీబీ సూపర్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది.
ఇక ఆర్సీబీ మైనస్‌ల విషయానికి వస్తే.. బ్యాటింగ్, పేస్ బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఒక క్వాలిటీ స్పిన్నర్ లేడని చెప్పవచ్చు. మిస్టరీ స్పిన్నర్‌గా ఉన్న సుయాష్ శర్మపైనే ఆర్సీబీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్యా, లివింగ్‌స్టోన్ వంటి వాళ్లు ఉన్నా.. ఎంతైనా ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే బాగుండేది. ఇక ప్లేయింగ్ ఎలెవన్ కూర్పు కూడా కాస్త కష్టంగా మారే అవకాశం ఉంది. జట్టులో ఉన్న ప్లేయర్లలో ఫారెన్ ప్లేయర్లు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం నలుగురే ఉండాలి. జోస్ హెజల్‌వుడ్, నుమాన్ తుషారా, లుంగి ఎన్గిడి, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్ ఇలా చూస్తే.. అందర్నీ తీసుకోవాల్సిందే అనేలా ఉన్నారు. కానీ, వీరిలో నలుగురిని మాత్రమే తీసుకోవాలి. ఇది కచ్చితంగా కెప్టెన్‌తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అలాగే టీమ్ కాంబినేషన్ కూడా తరచూ మార్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఆర్సీబీలో కీలక ఆటగాళ్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, ఫిల్ సాల్ట్, భువిలను కీ ప్లేయర్లుగా చెప్పుకోవచ్చు. వీళ్లు ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అలాగే లియామ్ లివింగ్‌స్టోన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఉండే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల లివింగ్‌స్టోన్ తన స్థాయికి తగ్గట్లు ఆడితే.. ఆర్సీబీ మిడిల్డార్‌లో సూపర్ స్ట్రాంగ్ అవ్వడంతో పాటు క్వాలిటీ స్పిన్నర్ లేని లోటు కూడా తీరిపోతుంది. అంతా బాగానే కనిపిస్తున్నా.. ఇంత మంది స్టార్ క్రికెటర్లు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్, అంచనాలను యువ కెప్టెన్ రజత్ పాటీదార్ ఎలా మోస్తాడా? అనే డౌట్ అందరిలో ఉంది. ఏం కంగారు పడకండి.. మనోడికి డొమెస్టిక్ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. పైగా అతనికి అండగా విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఎప్పుడూ చాలా కామ్ అండ్ కంపోజుడ్‌గా ఉండే పాటీదార్.. ఆర్సీబీని సమర్థవంతంగా నడిపిస్తాడనడంలో ఎలాంటి డౌట్ లేదు.
కానీ, ఆరంభంలో రెండు మూడు విజయాలు వస్తే.. అతని కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం టీమ్ మొత్తం అతనికి సపోర్ట్‌గా ఉండాలి. ఇక ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం విషయానికి వస్తే.. ప్రతి సీజన్‌లో ఆర్సీబీ సగం మ్యాచ్‌లు ఇక్కడ ఆడుతుంది. ఈ సారి కూడా అంతే. కానీ, ఆర్సీబీకి ఇక్కడ అంత మంచి రికార్డ్ లేదు. బౌలింగ్ వైఫల్యం, బ్యాటింగ్ కొలాప్స్ కావడం వల్ల ఇక్కడ మ్యాచ్‌లు ఓడిపోతూ వస్తోంది. కానీ, ఈ సారి ఆ లెక్కలు మార్చాలంటే అది బౌలర్ల వల్లే అవుతుంది. అందుకే ఆక్షన్‌లోనే ఆర్సీబీ మెనేజ్‌మెంట్ బౌలర్లపై ఫోకస్ పెట్టి, ఎక్కువ మంది బౌలర్లను పిక్ చేసుకుంది. మరి తనకున్న మంచి ఆప్షన్స్‌లో రజత్ పాటీదార్ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌ను పిక్ చేసుకుంటాడో చూడాలి.
ఇక చివరిగా.. ది బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందని అనుకుంటే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్త్ పడిక్కల్, రజత్ పాటీదార్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, యష్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




