537 వికెట్లు, 6 శతకాలు.. ఇలాంటోడు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే వెరీ రేర్ పీస్ భయ్యా..!

Team India: భారత క్రికెట్ జట్టు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. ఆరంభంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ఆ తరువాత ఆఫ్ స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థి జట్లను వణికించాడు. టెస్టుల్లో 537 వికెట్లు తీయడమే కాకుండా 6 సెంచరీలు బాది అరుదైన ఆల్‌రౌండర్ ఘనతను సొంతం చేసుకుని క్రికెట్ చరిత్రలో నిలిచాడు.

537 వికెట్లు, 6 శతకాలు.. ఇలాంటోడు ప్రపంచ క్రికెట్ హిస్టరీలోనే వెరీ రేర్ పీస్ భయ్యా..!
Ravichandran Ashwin Career

Updated on: Sep 17, 2026 | 9:29 PM

Team India: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కెరీర్ ఓపెనింగ్ బ్యాటర్‌గా మొదలైంది. 1986 సెప్టెంబర్ 17న చెన్నై నగరంలో జన్మించిన ఆయన, మీడియం పేస్ బౌలరైన తండ్రి రవిచంద్రన్ ప్రోత్సాహంతో చిన్నతనంలోనే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. సుమారు 14 ఏళ్ల వయసులో ఎదురైన తీవ్ర గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి జట్టులో ఓపెనర్ స్థానం మరొకరికి దక్కింది. ఆ క్లిష్ట సమయంలో తల్లి ఇచ్చిన విలువైన సలహాతో స్పిన్ బౌలింగ్ సాధన మొదలుపెట్టాడు. ఆఫ్ స్పిన్‌ను తన ప్రధాన ఆయుధంగా మార్చుకుని, దేశవాళీ క్రికెట్ పోటీల్లో అద్భుతంగా రాణించి జాతీయ సెలక్టర్లను ఆకర్షించాడు. 2010లో జింబాబ్వేపై వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ వేదికపై అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 క్రికెట్ లోనూ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

2011 సీజన్లో వెస్టిండీస్ జట్టుపై అరంగేట్రం చేస్తూ టెస్ట్ క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అదే ఏడాది భారత్ గెలిచిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) సాధించిన సందర్భంలోనూ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్ పొడవునా 106 టెస్టుల్లో బరిలోకి దిగి ఏకంగా 537 వికెట్లు నేలకూల్చాడు. ఇందులో 37 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం విశేషం. 250, 300 వికెట్ల మైలురాళ్లను అత్యంత వేగంగా చేరుకున్న బౌలర్ల జాబితాలో నిలిచాడు. వైవిధ్యమైన క్యారమ్ బాల్, విభిన్న వేగాలతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ ఆయన ప్రభావం చూపించాడు. 116 వన్డే మ్యాచ్‌లలో 156 వికెట్లు సాధించగా, 65 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీశాడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు జోడించాడు. టెస్టుల్లో 3,503 పరుగులు చేయడమే కాకుండా 6 అద్భుతమైన శతకాలు బాదాడు. వన్డేల్లోనూ 707 పరుగులు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 వికెట్లతో పాటు 6 శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ 11 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఆయన అసమాన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2015లో అర్జున అవార్డును, 2025లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us