IND vs SA : అవన్నీ దిక్కుమాలిన పనులు..టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

భారత్, సౌతాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ కోచ్, మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉండటంతో, టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని శాస్త్రి తప్పుపట్టారు.

IND vs SA : అవన్నీ దిక్కుమాలిన పనులు..టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్
Ravi Shastri

Updated on: Nov 25, 2025 | 11:25 AM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ కోచ్, మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉండటంతో, టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని శాస్త్రి తప్పుపట్టారు. 489 పరుగుల సౌతాఫ్రికా స్కోరుకు సమాధానంగా భారత్ కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది.

స్టార్ నెట్‌వర్క్‌లో కామెంటరీ ఇస్తున్న రవిశాస్త్రి, భారత జట్టు నిర్ణయాలను ఏ మాత్రం సమర్థించలేదు. “అసలు అర్థం లేదు. ఆ ఆలోచనా విధానం ఏంటో నాకు అర్థం కావడం లేదు” అని ఆయన టీమిండియా పై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను తరచూ మార్చడాన్ని ఆయన ప్రశ్నించారు. తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్‌ను నంబర్ 3 స్థానంలో పంపి, రెండో టెస్టులో సాయి సుదర్శన్‌ను నంబర్ 3లో ఉంచి, సుందర్‌ను ఏకంగా నంబర్ 8కి దించడం సరికాదన్నారు. “సుందర్ నంబర్ 8 బ్యాటర్ కాదు, అతను అంతకంటే మెరుగైన ఆటగాడు. ఈ సిరీస్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే, కొన్ని సెలెక్షన్ నిర్ణయాలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు” అని శాస్త్రి విమర్శించారు.

గతంలో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒక స్పిన్నర్‌కు కేవలం ఒకే ఓవర్ ఇవ్వడాన్ని కూడా శాస్త్రి గుర్తు చేశారు. “అక్కడ నలుగురు స్పిన్నర్లకు బదులు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్‌ను ఆడిస్తే బాగుండేది. అలాగే ఇక్కడ సాయి సుదర్శన్ వచ్చాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ను నంబర్ 8లో కాకుండా కనీసం నంబర్ 4లో అయినా ఆడించాల్సింది” అని ఆయన సూచించారు.

భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం తర్వాత, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ఎనిమిదో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యం కారణంగానే భారత్ కనీసం 200 పరుగుల మార్కును దాటగలిగింది. సుందర్ 92 బంతుల్లో 48 పరుగులు చేయగా, కుల్దీప్ 134 బంతుల్లో 19 పరుగులు చేసి వికెట్ పడకుండా పోరాడాడు. అయినప్పటికీ సౌతాఫ్రికా 288 పరుగుల భారీ ఆధిక్యాన్ని తీసుకోవడాన్ని ఆపలేకపోయారు. సౌతాఫ్రికా తరఫున మార్కో జన్సెన్ 6/48తో, సైమన్ హార్మర్ 3/64తో భారత బ్యాటింగ్ పతనానికి కారణమయ్యారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..