Ranji Trophy 2026 : 9 గంటల్లో 2 విమానాలు మారాడు.. టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు

Ranji Trophy 2026 : భారతదేశ దేశీవాళీ క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణ పోరాటం, అద్భుతమైన విజయం ఆవిష్కృతమైంది. హుబ్బళ్లి వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయింది.

Ranji Trophy 2026 : 9 గంటల్లో 2 విమానాలు మారాడు.. టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
Qamran Iqbal Century

Updated on: Feb 28, 2026 | 12:51 PM

Ranji Trophy 2026 : భారతదేశ దేశీవాళీ క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణ పోరాటం, అద్భుతమైన విజయం ఆవిష్కృతమైంది. హుబ్బళ్లి వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ సృష్టించిన సంచలనం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయింది. అసలు జట్టులో లేని ఆటగాడు, ఎయిర్‌పోర్టుల చుట్టూ తిరుగుతూ నిద్రలేకుండా ప్రయాణించి వచ్చి, మైదానంలో దిగి సెంచరీ బాదడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో జమ్మూ-కాశ్మీర్ తన మొదటి రంజీ టైటిల్‌ను ముద్దాడటం దాదాపు ఖాయమైపోయింది.

ఈ విజయగాథ వెనుక ఒక సినిమాను తలపించే డ్రామా ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు జమ్మూ రెగ్యులర్ ఓపెనర్ శుభం ఖజూరియా గాయపడటంతో, ఢిల్లీలో ఉన్న కమ్రాన్ ఇక్బాల్‌కు అర్ధరాత్రి పిలుపు వచ్చింది. రాత్రి 11:30 గంటలకు ఢిల్లీలో విమానం ఎక్కిన కమ్రాన్, తెల్లవారుజామున 1:55కు ముంబై చేరుకున్నాడు. అక్కడ నాలుగు గంటల నిరీక్షణ తర్వాత ఉదయం 6:15కు హుబ్బళ్లి ఫ్లైట్ ఎక్కి.. సరిగ్గా టాస్‌కు 30 నిమిషాల ముందు స్టేడియానికి చేరుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అలసట వల్ల విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కసిగా ఆడి 189 బంతుల్లో చారిత్రాత్మక సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో కేవలం రెండో శతకం మాత్రమే కావడం విశేషం.

మ్యాచ్ పరిస్థితిని గమనిస్తే.. జమ్మూ-కాశ్మీర్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి సమాధానంగా కర్ణాటక మొదటి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకే చాపచుట్టేసింది. ఆకిబ్ నబీ 5 వికెట్లతో కర్ణాటక నడ్డి విరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనే 291 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన జమ్మూ, రెండో ఇన్నింగ్స్‌లో కూడా కమ్రాన్ ఇక్బాల్ సెంచరీ పుణ్యమా అని 550 పరుగుల కంటే ఎక్కువ లీడ్‌ను సంపాదించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఈ మ్యాచ్ ఫలితం తేలకపోయినా, నిబంధనల ప్రకారం మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఉన్న జమ్మూ-కాశ్మీర్‌నే విజేతగా ప్రకటిస్తారు.

67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. యుద్ధ ప్రాతిపదికన ప్రయాణించి వచ్చి, జట్టును విజేతగా నిలబెట్టిన కమ్రాన్ ఇక్బాల్ ఇప్పుడు ఆ రాష్ట్రానికి రియల్ హీరో అయిపోయాడు. ఒక చిన్న రాష్ట్రం క్రికెట్ దిగ్గజం కర్ణాటకను వారి సొంత గడ్డపైనే ఓడించడం భారత క్రికెట్‌లో ఒక పెద్ద సంచలనం. ఈ విజయంతో జమ్మూ-కాశ్మీర్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us