
IND W vs AUS W : భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మన టీమిండియా అమ్మాయిల జెర్సీపై మెరుస్తున్న ఆ ఒక్క నక్షత్రం ఇప్పుడు 150 కోట్ల భారతీయుల గుండెల్లో గర్వాన్ని నింపుతోంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత జట్టు, ఇప్పుడు వన్డే సిరీస్‌లో తలపడుతోంది. అయితే ఈ సిరీస్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. 2025 వన్డే ప్రపంచ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన తర్వాత భారత్ ఆడుతున్న మొదటి వన్డే సిరీస్ ఇది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో మైదానంలోకి అడుగుపెట్టిన మన మహిళా క్రికెటర్ల జెర్సీపై బీసీసీఐ లోగో మీద తొలిసారిగా ఒక స్టార్ దర్శనమిచ్చింది.
వాస్తవానికి ఈ ఒక్క స్టార్ వెనుక దాదాపు 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, కఠోర శ్రమ దాగి ఉంది. భారత మహిళా జట్టు తన మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ను 1978 జనవరి 1న ఇంగ్లాండ్‌తో ఆడింది. అప్పటి నుంచి ప్రపంచ కప్ అందుకోవాలనే కల దశాబ్దాల పాటు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 2025లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ఆ కలను నిజం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు ఏ ఫార్మాట్‌లో ఎన్ని ప్రపంచ కప్‌లు గెలిస్తే, ఆ ఫార్మాట్ జెర్సీపై అన్ని నక్షత్రాలు ముద్రించుకునే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఇప్పుడు మన మహిళా వన్డే జెర్సీపై అధికారికంగా మొదటి స్టార్ చేరింది. సోషల్ మీడియాలో ఈ కొత్త జెర్సీ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ చారిత్రాత్మక విజయం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నమోదైంది. 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచి కేవలం 246 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరడం విశేషం. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్ల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ, భారత మహిళా జట్టు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. ఆ జెర్సీపై ఉన్న స్టార్ కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది భారత నారీ శక్తికి నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..