Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వయసు..36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

Vaibhav Suryavanshi : ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడుతూ అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదడమే కాకుండా, మొత్తం 190 పరుగులతో విశ్వరూపం చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వయసు..36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
Pm Modi Praises Vaibhav Suryavanshi

Updated on: Dec 26, 2025 | 8:20 AM

Vaibhav Suryavanshi : ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ అనే పేరు మారుమోగిపోతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు క్రికెట్ మైదానంలో సృష్టిస్తున్న సంచలనాలు చూసి దిగ్గజాలే నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడుతూ అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదడమే కాకుండా, మొత్తం 190 పరుగులతో విశ్వరూపం చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో క్రీడాకారుల ఎంపిక ఇప్పుడు వారసత్వం లేదా సిఫార్సుల ప్రాతిపదికన కాకుండా కేవలం టాలెంట్ ఆధారంగానే జరుగుతోందని ప్రధాని గర్వంగా చాటిచెప్పారు.

ప్రధాని మోదీ తన తాజా ప్రసంగంలో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో ఇప్పుడు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. “మునుపటిలా కోచ్‌ల ప్రాబల్యం లేదా తెలిసిన వారి రికమెండేషన్లతో కాకుండా, మైదానంలో అద్భుతాలు చేసే ప్రతిభావంతులకే ప్రాధాన్యత దక్కుతోంది. నిన్ననే మీరు చూసి ఉంటారు.. కేవలం 14-15 ఏళ్ల కుర్రాళ్లు మైదానంలో దిగి 32 నుంచి 36 బంతుల్లోనే సెంచరీలు బాదేస్తున్నారు. ఒక పేద కుటుంబానికి చెందిన పిల్లాడు కూడా ఈరోజు శిఖరాగ్రానికి చేరుకోగలడు. దానికి కావలసిన అపరిమితమైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది” అని మోదీ వ్యాఖ్యానించారు.

గతంలో క్రీడా శాఖలో, జట్ల ఎంపికలో, క్రీడా మౌలిక సదుపాయాల విషయంలో జరిగే అక్రమాలను తన ప్రభుత్వం పూర్తిగా అరికట్టిందని ప్రధాని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా, స్కూల్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ వంటి కార్యక్రమాల ద్వారా దేశంలోని ప్రతి మూల నుంచి కొత్త స్టార్లను వెలికితీస్తున్నామని ఆయన వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు టైర్-2, టైర్-3 నగరాల్లో సైతం తిరుగుతూ టాలెంటును గుర్తిస్తున్నాయని చెప్పారు. క్రీడాకారుల ఆహారం, శిక్షణ, ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.

క్రీడల కోసం కేటాయించే బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం భారీగా పెంచిందని మోదీ గుర్తుచేశారు. 2014 కంటే ముందు దేశ క్రీడా బడ్జెట్ కేవలం రూ.1200 కోట్లు ఉంటే, ఇప్పుడు అది రూ.3000 కోట్లకు పైగా చేరుకుందని ఆయన వెల్లడించారు. అలాగే టాప్స్(TOPS) పథకం కింద అర్హులైన క్రీడాకారులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. వైభవ్ సూర్యవంశీ లాంటి అసాధారణ ప్రతిభావంతులు వెలుగులోకి రావడమే ఈ ప్రయత్నాల విజయానికి నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు. ఐపీఎల్ వేలంలోనూ కనిష్ట ధరకే అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్, ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో తన పవరేంటో నిరూపించుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..