
Peshawar Zalmi Captain Babar Azam: పీఎస్ఎల్ (PSL) 2025లో భాగంగా 9వ మ్యాచ్‌లో పెషావర్ జల్మి వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, పెషావర్ కెప్టెన్ బాబర్ అజామ్ అభిమానులు ఈసారి అతని బ్యాట్ నుంచి పరుగులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అతని పేలవమైన ప్రదర్శన జట్టుపై కూడా ప్రభావం చూపింది. పెషావర్ జల్మి గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో బాగా రాణిస్తాడని భావించిన బాబార్.. ఈసారి కూడా ఎలాంటి అద్భుతం చేయలేకపోయాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బాబర్ ఆజం వైఫల్యం అతని అభిమానులతోపాటు జట్టు ఆటగాళ్లను నిరాశకు గురిచేసింది.
క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో, పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ అజామ్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. క్వెట్టాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ అమీర్ బాబర్‌ను కేవలం రెండు బంతుల్లోనే అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్ 3 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతని పేలవమైన ప్రదర్శన కారణంగా, పెషావర్ జల్మి వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మూడవ మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. బాబర్ 5 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్ డేవిడ్ విల్లీకి బలి అయ్యాడు.
బాబర్ ఆజం టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ దిగ్గజ ఆటగాళ్ళలో ఒకడిగా పేరుగాంచాడు. కానీ, దేశీయ లీగ్ క్రికెట్‌లో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బాబర్ కెప్టెన్సీని వదిలి తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని మాజీ క్రికెటర్లు సలహా ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ బాబర్ అజామ్‌కి విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు. బాబర్ 2023లో నేపాల్‌పై 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, అతని బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. అందువల్ల అతని పేలవమైన ఫామ్, కెప్టెన్సీని ప్రభావితం చేస్తోందని సూచించాడు. బాబర్ అజామ్ పెషావర్ జల్మి కెప్టెన్సీని వదిలి తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని బాసిత్ అలీ అన్నారు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలి తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఈ సీజన్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు వస్తున్నాయి. బాబర్ కూడా కెప్టెన్సీని వదిలి తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని అంతా సూచిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.