
Parthiv Patel Advice : భారత జట్టు మాజీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కీలకమైన సలహా ఇచ్చారు. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు తమ మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కోసం, వారు దేశీయ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని ఆయన కోరారు. పటేల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత జట్టులోని ఇద్దరు సీనియర్ స్టార్లకు నిలకడగా మ్యాచ్‌లు ఆడటం ఎంత ముఖ్యమో పార్థివ్ పటేల్ వివరించారు. “రెండేళ్ల సమయం చాలా ఎక్కువ, పైగా ఈ రోజుల్లో వన్డే మ్యాచ్‌లు కూడా పెద్దగా లేవు” అని పటేల్ అన్నారు. గతంలో ఆటగాళ్లు సంవత్సరానికి 20-25 మ్యాచ్‌లు ఆడేవారు కాబట్టి, ఫామ్‌లో ఉండటం సులభమయ్యేది. కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు లేని కారణంగా, మ్యాచ్ ఫిట్‌గా ఉండటం ఒక కొత్త సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశపు ప్రధాన దేశీయ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం వల్ల కోహ్లీ, రోహిత్‌లకు అవసరమైన కాంపిటేటివ్ రిథమ్ లభిస్తుందని పటేల్ బలంగా నమ్ముతున్నాడు. “వారు ఉదాహరణగా ఉండాలని నేను చెప్పడం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం వారి ఆటకే సహాయపడుతుంది. లాస్టుకు దీని వల్ల భారత క్రికెట్ జట్టుకు ప్రయోజనం కలుగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
టీమిండియాలో కెప్టెన్సీ మార్పుల గురించి కూడా పార్థివ్ పటేల్ మాట్లాడారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అన్ని ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లను గిల్ ఎలా నడిపిస్తాడనే ఆందోళన అవసరం లేదని పటేల్ అన్నారు. “విరాట్, రోహిత్ ఎలాంటి వ్యక్తులు అనే దానిపై నాకు ఎలాంటి సమస్య ఉంటుందని అనుకోవడం లేదు” అని పటేల్ తెలిపారు. “ఎంఎస్ ధోనీ ఆడుతున్నప్పుడే విరాట్ కెప్టెన్ అయ్యాడు, కాబట్టి కొత్త కెప్టెన్లను ప్రోత్సహించడంలో సీనియర్ల పాత్ర గురించి విరాట్‌కు తెలుసు. అదేవిధంగా, రోహిత్ కూడా ఇదే దశను అనుభవించాడు. భారత క్రికెట్ మంచికోసం తీసుకునే నిర్ణయాలను ఈ ఇద్దరూ పరిణతి చెందిన ఆటగాళ్లుగా అర్థం చేసుకుంటారు. వారిని మేనేజ్ చేయడానికి శుభ్‌మన్ శక్తిని వృథా చేయాల్సిన అవసరం లేదు.” అని చెప్పారు.
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసినప్పుడు గిల్‌ను దగ్గరగా చూసిన పార్థివ్ పటేల్, యువ కెప్టెన్ నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. “శుభ్‌మన్ బాగా రెడీ అవుతాడు, నిర్ణయాలు తీసుకోవడంలో క్లారిటీ ఉంటుంది. అతనికి యస్ ఆర్ నో అనే విధానం ఉంది. బహుశా అనే మాట ఉండదు” అని పటేల్ చెప్పారు. “అతను పరిస్థితులకు అనుగుణంగా మారతాడు. సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు – ఇవే ఒక కెప్టెన్‌లో మీరు కోరుకునే లక్షణాలు.” భారత జట్టు సీనియర్లు, కొత్త నాయకత్వం మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పార్థివ్ పటేల్ సలహా చాలా విలువైనది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..