పిల్ల బచ్చా కాదు.. పులి పంజా! 24 ఏళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన ఓ అద్భుతం

17 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 124 పరుగులు అతని అత్యుత్తమ స్కోరు. 2003 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నాడు. 2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ టైటిల్, గుజరాత్‌కు రంజీ ట్రోఫీ అందించాడు. ఆ క్రికెటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్ల బచ్చా కాదు.. పులి పంజా! 24 ఏళ్ల క్రితం టీమిండియాలోకి వచ్చిన ఓ అద్భుతం
Parthiv Patel

Updated on: Aug 08, 2026 | 6:35 PM

టీమిండియాలోకి చాలా మంది ఆటగాళ్లు అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలె వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు కేవలం 15 ఏళ్లకే టీమిండియా తరఫున ఆడి, అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరున ఉండేది. సచిన్ 17 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే సచిన్ లానే కేవలం 17 ఏళ్లకే టీమిండియా తరఫున బరిలోకి దిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఓ అద్భుతమైన క్రికెటర్ ఉన్నాడు. బహుషా ఈ తరం క్రికెట్ అభిమానులకు అతను తెలియకపోవచ్చు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉండే ఆ ప్లేయర్ షాట్లు ఆడితే ఎంతో అందగా ఉండేది. వికెట్ల వెనుక పక్షిలా ఎగిరెగిరి బాల్ పడుతుంటే చూడముచ్చటగా ఉండేది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే.. చూడ్డానికి పిల్ల బచ్చాలా ఉన్నా పులి పంజాలా విరుచుకుపడే పార్థీవ్ పటేల్. ఈ మాజీ క్రికెటర్ 24 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే ఆగస్టు 8, 2002లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా అతని గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థీవ్ పటేల్ పేరు భారత క్రికెట్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించిన పార్థీవ్, టీమిండియాలోకి వచ్చిన తొలి రోజుల్లోనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం ఆడకపోయినా, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు.

17 ఏళ్లకే టీమిండియాలోకి..

పార్థీవ్ పటేల్ 1985 మార్చి 9న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న అతను వికెట్ కీపింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2002లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17 సంవత్సరాల 153 రోజుల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసి, టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో 65 మ్యాచ్‌లు

పార్థీవ్ భారత్ తరఫున మొత్తం 65 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. టెస్టుల్లో 934 పరుగులు, వన్డేల్లో 736 పరుగులు, టీ20ల్లో 36 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 6 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు.

టెస్టుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్

పార్థీవ్ పటేల్ టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు 124 పరుగులు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బ్యాటింగ్‌లోనూ జట్టుకు కీలక సహకారం అందించాడు. పార్థీవ్ కెరీర్‌లో మరో ప్రత్యేక ఘట్టం 2003 వన్డే ప్రపంచకప్. యువ ఆటగాడిగా భారత ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. ఆ సమయంలో టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ, పార్థీవ్ భవిష్యత్ కోసం జట్టులో కీలక ఎంపికగా కనిపించాడు.

ఐపీఎల్‌లోనూ తన మార్క్..

అంతర్జాతీయ కెరీర్‌లో ఎప్పటికప్పుడు చోటు దక్కకపోయినా పార్థీవ్ పటేల్ ఐపీఎల్‌లో మాత్రం అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్ల తరఫున ఆడాడు. ముంబై ఇండియన్స్‌తో 2015లో ఐపీఎల్ టైటిల్ గెలవడం అతని కెరీర్‌లో ముఖ్యమైన ఘట్టం.

దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రయాణం

గుజరాత్ తరఫున పార్థీవ్ పటేల్ దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో సంవత్సరాలు ఆడాడు. 2016-17 రంజీ ట్రోఫీలో గుజరాత్‌ను తొలిసారి టైటిల్‌ దిశగా నడిపించడంలో అతని నాయకత్వం కీలకంగా నిలిచింది. ఫైనల్లో ముంబైపై గుజరాత్ విజయం సాధించడం అతని కెరీర్‌లో మరపురాని విషయం. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ పార్థీవ్ దేశవాళీ, ఐపీఎల్‌లో కొనసాగాడు. 2020 డిసెంబర్‌లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కామెంటరీ, క్రికెట్ విశ్లేషణ వంటి రంగాల్లో కొనసాగుతూ క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us