
Jammu Cricket Palestine Flag Controversy: జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఒక స్థానిక క్రికెట్ టోర్నమెంట్‌లో పాలస్తీనా జెండా ప్రదర్శన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ (JKCL) మ్యాచ్ సందర్భంగా ఒక క్రికెటర్ తన హెల్మెట్‌పై పాలస్తీనా జెండాను ధరించడం వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
జమ్మూలో బుధవారం ‘జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్’ టోర్నమెంట్‌లో భాగంగా JK11 కింగ్స్, జమ్మూ ట్రైల్‌బ్లేజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో JK11 కింగ్స్ జట్టుకు చెందిన ఫుర్కాన్ భట్ అనే ఆటగాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన హెల్మెట్‌పై పాలస్తీనా జాతీయ జెండాను స్టిక్కర్‌గా ధరించి కనిపించాడు. మైదానంలో ఆటగాడు ఇలా పరాయి దేశ జెండాను ప్రదర్శించడం చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల విచారణ, సమన్లు: ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జమ్మూ రూరల్ పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతిభద్రతల దృష్ట్యా, క్రీడా వేదికలపై రాజకీయ చిహ్నాల ప్రదర్శనపై ఉన్న నిబంధనల మేరకు క్రికెటర్ ఫుర్కాన్ భట్‌ను విచారణకు పిలిపించారు. కేవలం ఆటగాడినే కాకుండా, టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ కు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎవరి అనుమతితో ఇలా చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వివరణ.. ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. వివాదాస్పదమైన ఈ టోర్నమెంట్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
“ఇది ఒక ప్రైవేట్, అనధికారిక లీగ్. దీనికి JKCA లేదా BCCI గుర్తింపు లేదు.” అని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సదరు ఆటగాడు ఫుర్కాన్ భట్ కూడా అసోసియేషన్‌లో నమోదైన ఆటగాడు కాదని వారు తేల్చి చెప్పారు. అనధికారిక లీగ్‌లలో పాల్గొనే ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అనధికారిక లీగ్‌ల బెడద.. గతంలో కూడా కాశ్మీర్‌లో ‘ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్’ (IHPL) వంటి అనధికారిక లీగ్‌లు వివాదాలకు కేంద్రమయ్యాయి. తాజా ఘటనతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. క్రీడలను రాజకీయ లేదా అంతర్జాతీయ వివాదాలకు వేదికగా మార్చడం సరికాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..