
Smriti Mandhana : మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్, క్రికెటర్ స్మృతి మంధానల పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి రద్దు వెనుక పలాష్ ప్రవర్తనే కారణమని, అతను స్మృతిని మోసం చేశాడని మరాఠీ నటుడు, నిర్మాత విజ్ఞాన్ మానే సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో పెట్టుబడి పేరుతో పలాష్ తన దగ్గర రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పలాష్, ఇవన్నీ తన ప్రతిష్టను దిగజార్చడానికి చేస్తున్న కుట్రలని కొట్టిపారేశారు.
విజ్ఞాన్ మానే ఆరోపణల ప్రకారం.. 2023 డిసెంబర్‌లో పలాష్‌ను కలిసినప్పుడు నజారియా అనే చిత్రంలో నిర్మాతగా పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని పలాష్ నమ్మించాడట. మార్చి 2025 నాటికి విజ్ఞాన్ దాదాపు రూ.40 లక్షలు చెల్లించినట్లు క్లెయిమ్ చేశారు. సినిమా పూర్తి కాకపోవడంతో తన డబ్బు తిరిగి అడిగితే పలాష్ స్పందించలేదని, పైగా స్మృతి మంధానతో పెళ్లి వేడుకల సమయంలో పలాష్ వేరే మహిళతో దొరికిపోయాడని, అందుకే మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారని కూడా విజ్ఞాన్ వింత ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ తీవ్రంగా ఖండించారు. తన లాయర్ శ్రేయాన్ష్ మిథారే ద్వారా విజ్ఞాన్ మానేకు రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. కేవలం తన పేరును, క్యారెక్టర్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే విజ్ఞాన్ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని పలాష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..