Palash Muchhal : ముందు పెళ్లి రద్దు..ఇప్పుడు రూ.40లక్షల మోసం ఆరోపణలు..పలాష్ ముచ్చల్‎కు బిగుస్తున్న ఉచ్చు

Palash Muchhal : ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో పెళ్లి రద్దు వ్యవహారం మరవక ముందే, ఇప్పుడు ఆయనపై ఏకంగా రూ.40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలు వచ్చాయి.

Palash Muchhal : ముందు పెళ్లి రద్దు..ఇప్పుడు రూ.40లక్షల మోసం ఆరోపణలు..పలాష్ ముచ్చల్‎కు బిగుస్తున్న ఉచ్చు
Smriti Mandhana Wedding

Updated on: Jan 23, 2026 | 7:15 PM

Palash Muchhal : ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో పెళ్లి రద్దు వ్యవహారం మరవక ముందే, ఇప్పుడు ఆయనపై ఏకంగా రూ.40 లక్షల ఫ్రాడ్ ఆరోపణలు వచ్చాయి. అది కూడా స్మృతి మంధాన సన్నిహితుడినే పలాష్ బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు, సింగర్ పలాష్ ముచ్చల్‌కు గత ఆరేళ్లుగా ప్రేమాయణం నడిచిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్లో వీరిద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. పెళ్లి వేడుకలు మొదలైన సమయంలోనే స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని, అసలు పెళ్లి జరగదని అధికారికంగా తేలిపోయింది. అప్పట్లోనే పలాష్.. స్మృతిని మోసం చేశాడన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే పలాష్‌పై స్మృతికి అత్యంత సన్నిహితుడైన వైభవ్ మానే అనే వ్యక్తి రూ.40 లక్షల మోసం ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.

అసలు విషయం ఏమిటంటే.. సాంగ్లీకి చెందిన వైభవ్ మానేను, స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన స్వయంగా పలాష్ ముచ్చల్‌కు పరిచయం చేశారు. వైభవ్, స్మృతి చిన్ననాటి స్నేహితులు కావడంతో వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2023 డిసెంబర్‌లో వీరిద్దరూ కలిసినప్పుడు, పలాష్ తాను తీయబోయే నజరియా అనే సినిమా గురించి వివరించాడు. ఆ సినిమాలో గనుక పెట్టుబడి పెడితే.. సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత భారీ లాభాలు వస్తాయని వైభవ్‌ను నమ్మించాడు. పలాష్ మాటలను నమ్మిన వైభవ్, విడతల వారీగా మొత్తం రూ.40 లక్షలను పలాష్ ఖాతాలో జమ చేశాడు.

అయితే రోజులు గడుస్తున్నా సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు విడుదలవుతుంది? అని వైభవ్ ఎన్నిసార్లు అడిగినా పలాష్ సరైన సమాధానం ఇవ్వలేదు. చివరకు సినిమా అసలు పట్టాలెక్కలేదని వైభవ్‌కు అర్థమైంది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని పలాష్‌ను కోరగా, అతను దాటవేస్తూ వచ్చాడు. నెలల తరబడి వేచి చూసిన వైభవ్, చివరకు విసిగిపోయి సాంగ్లీ పోలీస్ సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. తన వద్ద ఉన్న ఆధారాలను, డబ్బు బదిలీ చేసిన డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించాడు.

ఈ మోసం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, స్మృతి మంధానతో పలాష్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కూడా ఇలాంటి ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక మరేదైనా మోసం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఒక ప్రముఖ గాయకుడు, డైరెక్టర్ పై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పలాష్ ముచ్చల్ అరెస్ట్ అవుతారా? లేదా డబ్బులు తిరిగి చెల్లిస్తారా? అన్నది వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..