U19 World Cup 2026 : అడ్డదారిలో సూపర్-6 కు స్కెచ్..పాక్ కెప్టెన్‌కు ఐసీసీ షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఖాయమా ?

U19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు వ్యవహరించిన తీరు ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, పాక్ ప్లేయర్లు కావాలనే జిత్తులమారి ఎత్తుగడ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం నెట్ రన్ రేట్ పెంచుకోవడమే కాకుండా, స్కాట్లాండ్ జట్టును టోర్నీ నుంచి తప్పించి జింబాబ్వేను ముందుకు పంపేలా పాక్ వ్యూహం రచించింది. ఈ పరిణామంతో ఐసీసీ పాకిస్థాన్ కెప్టెన్‌పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.

U19 World Cup 2026 : అడ్డదారిలో సూపర్-6 కు స్కెచ్..పాక్ కెప్టెన్‌కు ఐసీసీ షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఖాయమా ?
U19 World Cup 2026

Updated on: Jan 24, 2026 | 9:54 AM

U19 World Cup 2026 :జింబాబ్వేలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఆతిథ్య జింబాబ్వే నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ మొదట వీరవిహారం చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి 96 పరుగులు చేసి గెలుపుకు చేరువలో ఉంది. అయితే అక్కడి నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత వచ్చిన 10 ఓవర్లలో పాక్ బ్యాటర్లు కేవలం 27 పరుగులు మాత్రమే చేసి అత్యంత నెమ్మదిగా మ్యాచ్‌ను ముగించారు. ఇది అనుకోకుండా జరిగింది కాదు, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

ఈ వ్యూహం వెనుక ఒక పెద్ద లెక్క ఉంది. అండర్-19 వరల్డ్ కప్ రూల్స్ ప్రకారం.. గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్-6 కు వెళ్లే జట్లు తమ నెట్ రన్ రేట్‌ను కూడా వెంట తీసుకెళ్తాయి. అయితే ఒక కండిషన్ ఏంటంటే.. ఏ జట్లయితే సూపర్-6కు క్వాలిఫై అవుతాయో, ఆ జట్లపై సాధించిన రన్ రేట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పాకిస్థాన్ 26వ ఓవర్ కంటే ముందే గెలిచి ఉంటే, స్కాట్లాండ్ జట్టు సూపర్-6కు వెళ్లేది. అప్పుడు స్కాట్లాండ్‌పై పాక్ సాధించిన తక్కువ రన్ రేట్ కౌంట్ అయ్యేది. కానీ మ్యాచ్‌ను 26.2 ఓవర్ల వరకు లాగడం వల్ల జింబాబ్వే క్వాలిఫై అయింది. జింబాబ్వేపై పాక్‌కు భారీ విక్టరీ మార్జిన్ ఉండటంతో సూపర్-6లో పాకిస్థాన్‌కు భారీ రన్ రేట్ కలిసొచ్చింది.

పాకిస్థాన్ చేసిన ఈ నెట్ రన్ రేట్ మానిప్యులేషన్ ఇప్పుడు ఐసీసీ దృష్టికి వెళ్లింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.11 ప్రకారం.. వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కావాలనే మ్యాచ్ ఫలితాన్ని లేదా రన్ రేట్‌ను ప్రభావితం చేయడం నేరం. ఒకవేళ పాకిస్థాన్ దోషిగా తేలితే, ఆ జట్టు కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌పై ఐసీసీ తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అతడిపై కొన్ని మ్యాచ్‌ల నిషేధం లేదా భారీ జరిమానా విధించవచ్చు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు పాక్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

మరోవైపు ఈ గందరగోళం మధ్య సూపర్-6 దశలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ పోరుపై అందరి కళ్లు నెలకొన్నాయి. ఒకవేళ పాక్ కెప్టెన్‌పై నిషేధం పడితే అది ఆ జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. మరి ఐసీసీ దీనిని స్మార్ట్ మూవ్‌గా చూస్తుందా లేక క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ ఉదంతం క్రికెట్ ప్రపంచంలో వ్యూహాత్మక మోసం పై కొత్త చర్చకు తెరలేపింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..