India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. దాయాదుల మధ్య జరిగే పోరుపై అందరి దృష్టి పడుతుంది. చాలా రోజుల తర్వాత ఇరు జట్లు తలపడే సందర్భం తాజాగా ఆసియా కప్ 2022 రూపంలో వచ్చిన విషయం తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా దాయాదుల మధ్య మరో పోరుకు రంగం సిద్ధమైంది. ఏడు రోజుల వ్యవధిలోనే ఇండియా, పాకిస్థాన్ మరోసారి ఢీకొట్టనున్నారు. పాకిస్థాన్ చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించి సూపర్-ఫోర్ రౌండ్‌లోకి ప్రవేశించింది. దీంతో సెప్టెంబర్ 4 ఆదివారం రోజున భారతదేశం పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులకే కాదు ప్లేయర్స్‌కి కూడా ఎంతో ఆసక్తి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ ఇండియా, పాక్ మ్యాచ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. కేవలం 57 బంతుల్లో 78 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్‌ను తలపిస్తుంది అని చెప్పుకొచ్చాడు.
రిజ్వాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్థాన్‌లు తలపడుతున్నప్పుడు ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. మా జట్టు ఆత్మ విశ్వాసంతో ఉంది. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్న మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాము. షహీన్ అఫ్రిది స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతని ప్రదర్శన చాలా బాగుంది’ అని చెప్పుకొచ్చాడు. మరి ఆదివారం జరిగే ఇండియాపాకిస్థాన్ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారో చూడాలి.
మరిన్ని క్రికెట్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..