IND vs PAK: భారత బౌలర్లను మడతెట్టేసిన 19 ఏళ్ల పాక్ ప్లేయర్.. సిక్స్‌ల్లో సరికొత్త రికార్డ్..

|

Nov 30, 2024 | 4:15 PM

Ind vs pak U19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్‌పై పాకిస్థాన్ ఆటగాడు షాజెబ్ ఖాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లు బాది 150కి పైగా పరుగులు చేసి సిక్సర్ల భారీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

IND vs PAK: భారత బౌలర్లను మడతెట్టేసిన 19 ఏళ్ల పాక్ ప్లేయర్.. సిక్స్‌ల్లో సరికొత్త రికార్డ్..
Ind U19 Vs Pak U19
Follow us on

Shahzaib Khan: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024 UAEలో జరుగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ బ్యాట్స్‌మెన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆటగాడు మైదానంలో అన్నివైపుల నుంచి పరుగులు రాబట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఈ 19 ఏళ్ల ఆటగాడు సిక్సర్ల భారీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ ఆటగాడి బలంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారీ స్కోరును కూడా నమోదు చేసింది.

19 ఏళ్ల పాకిస్థానీ బ్యాట్స్‌మెన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌..

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున 19 ఏళ్ల షాజెబ్ ఖాన్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనింగ్ అనంతరం షాజెబ్ ఖాన్ చివరి ఓవర్ల వరకు క్రీజులో నిలిచాడు. పాక్ జట్టుకు శుభారంభం అందించి 107 బంతుల్లో 100 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆగని షాజెబ్ ఖాన్ కొద్దిసేపటికే 150 పరుగుల మార్కును దాటేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 147 బంతుల్లో మొత్తం 159 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్‌ నుంచి మొత్తం 10 సిక్స్‌లు, 5 ఫోర్లు వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో షాజెబ్ ఖాన్ 10 సిక్సర్లు కొట్టి భారీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అండర్-19 క్రికెట్‌లో పాకిస్థాన్ తరపున వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. ఇంతకు ముందు ఏ పాకిస్థానీ ఆటగాడు ఒక మ్యాచ్‌లో 7 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టలేకపోయాడు. షాజెబ్ ఖాన్ కంటే ముందు ఈ రికార్డు కమ్రాన్ గులాం, షమీల్ హుస్సేన్ పేరిట ఉంది. ఇద్దరు ఆటగాళ్లు తలా 7 సిక్సర్లు కొట్టిన ఘనత సాధించారు.

టీమిండియా టార్గెట్ 282..

ఈ మ్యాచ్‌లో పాక్‌ జట్టు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ తర్వాత ఉస్మాన్ ఖాన్, షాజెబ్ ఖాన్ జట్టుకు శుభారంభం అందించగా, ఇద్దరు ఆటగాళ్ల మధ్య తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ సమయంలో, ఉస్మాన్ ఖాన్ 94 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు షాజెబ్ ఖాన్ క్రీజులో కొనసాగడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సమర్థ్ నాగరాజ్ భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. 10 ఓవర్లలో 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

ఆదిలోనే భారత జట్లుకు ఇబ్బందులు..

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఐపీఎల్ సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆయుష్ మాత్రే తుఫాన్ ఇన్నింగ్స్‌తో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సిద్ధార్ద్ 15 కూడా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టు 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..