
టీం ఇండియా 2026లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు టీ20 ప్రపంచ కప్ టైటిళ్లను గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, ఆతిథ్య దేశంగా ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఈ చారిత్రక విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల నుంచి టీం ఇండియాకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
సీనియర్ ఆటగాళ్లు లేకుండానే, యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్‌లో జగత్ విజేతగా నిలవడం టీం ఇండియా అనుసరించిన దూకుడు వ్యూహానికి నిదర్శనం. ఆ దూకుడు మంత్రంతోనే 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించారు.
ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!
అఫ్రిది ముఖ్యంగా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రదర్శనను ప్రశంసించారు. అభిషేక్ శర్మ దూకుడైన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కు కీలక మలుపు అని ఆయన నొక్కిచెప్పారు. అభిషేక్ శర్మ ఇచ్చిన ప్రారంభం వల్లే టీం ఇండియా 250కి పైగా పరుగుల భారీ స్కోరును సాధించగలిగిందని అఫ్రిది పేర్కొన్నారు. ఒకవేళ అతన్ని త్వరగా ఔట్ చేసి ఉంటే, టీం ఇండియా స్కోరు 200-210 పరుగుల లోపు ఉండేదని, అప్పుడు న్యూజిలాండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించి గెలిచే అవకాశం ఉండేదని అఫ్రిది వివరించారు. అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 90కి పైగా పరుగులు సాధించడం, భారత్ సాధించిన 96 పరుగుల విజయం మార్జిన్‌కు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. న్యూజిలాండ్ బౌలర్లు అతన్ని ఆరంభంలోనే వికెట్ తీసి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదని అఫ్రిది అభిప్రాయపడ్డారు.
ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడంటే అభిషేక్ శర్మ ఎంత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడో అర్థమవుతుందని అఫ్రిది అన్నారు. ఈ ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడని, మరోసారి అదే జట్టుపై ఫైనల్‌లో తన వీరోచిత పోరాటం న్యూజిలాండ్‌కు శాపంగా మారిందని షాహిద్ అఫ్రిది పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్‌లోకి అతడే చాలా ప్రమాదకరమైన ఆటగాడు అని, ప్రతి జట్టులోని అతడి లాంటి ఇన్నింగ్స్ ఆడాలని, అతని లాంటి ఆటగాడు ఉండాలని కోరుకోవడం తప్పు లేదంటూ షాహిద్ అఫ్రిది అభిషేక్ శర్మను ప్రశంసించారు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ ఎక్కువ మ్యాచ్‌లలో జట్టును గెలిపించకపోయినా, అసలైన ఫైనల్ మ్యాచ్‌లోని అతని ఇన్నింగ్స్ అత్యంత కీలకమని అఫ్రిది అన్నారు. వ్యక్తిగతంగా తనకు టీం ఇండియా ప్రపంచ కప్ గెలవడం ఇష్టం లేదని అఫ్రిది అంగీకరించినా, గెలుపును ఎవరూ ఆపలేరు కదా అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..