
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో యూఎస్ఏ పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి, చిరకాల ప్రత్యర్థి భారత్‌ను రెండో స్థానానికి నెట్టివేసింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటారు. యూఎస్ఏపై సాధించిన ఈ భారీ విజయంతో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 4 పాయింట్లతో గ్రూప్-Aలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న భారత్ ఒక మ్యాచ్ ఆడి ఒక విజయం (2 పాయింట్లు)తో రెండో స్థానానికి పడిపోయింది. నెదర్లాండ్స్ మూడో స్థానంలో ఉండగా, నమీబియా, యూఎస్ఏలు ఇంకా ఖాతా తెరవలేదు. పాకిస్థాన్ నెట్ రన్ రేట్ +0.932 కాగా, భారత్ రన్ రేట్ +1.450 గా ఉంది. ఫిబ్రవరి 15న జరిగే భారత్-పాక్ మ్యాచ్ ఈ గ్రూప్ విజేత ఎవరో తేల్చనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ సాయిమ్ అయూబ్ (19) విఫలమైనా, వన్ డౌన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. బాబర్ ఆజం (46) నెమ్మదిగా ఆడినా, చివర్లో షాదాబ్ ఖాన్ కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోరును 190కి చేర్చాడు.
191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను పాక్ స్పిన్నర్లు తమ ఉచ్చులో బిగించారు. అమెరికా ఓపెనర్లు షాయన్ జహంగీర్ (49), ఆండ్రీస్ గౌస్ (13) మంచి ఆరంభాన్ని ఇచ్చినా, స్పిన్నర్లు రంగంలోకి దిగాక కథ మారిపోయింది. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, నవాజ్ తలో వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్ శుభమ్ రంజనే (51) పోరాడినా ఫలితం లేకపోయింది. అమెరికా 20 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..