T20 World Cup: అపజయాలు.. ఆపై అవమానాలు.. అనూహ్యంగా పుంజుకుని ఫైనల్‌కు.. కప్ కోసం కసిగా ఆడుతున్న పాక్

|

Nov 10, 2022 | 7:47 AM

టీ20 వరల్డ్‌ కప్‌లో ఫైనల్ బెర్త్ కన్‌ఫామ్ చేసుకుంది పాకిస్థాన్‌. కివీస్‌పై సూపర్ విక్టరీతో టైటిల్‌ రేసులో నిలబడింది. మరి పాక్‌ ప్రత్యర్థి ఎవరు..? టీమిండియా అయితే అన్న ఊహే.. ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది. దాయాది జట్లు ఫైనల్‌లో తలపడితే.. మరోసారి నరాలు తెగే మ్యాచ్‌ ఖాయం.

T20 World Cup: అపజయాలు.. ఆపై అవమానాలు.. అనూహ్యంగా పుంజుకుని ఫైనల్‌కు.. కప్ కోసం కసిగా ఆడుతున్న పాక్
Pakistan Cricket Team
Follow us on

తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో భంగపాటు.. ఆ తర్వాత జింబాబ్వే లాంటి వీక్‌ టీమ్‌ చేతిలో అనూహ్య ఓటమి.. టి20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్ ఆటతీరిది. ఆ సమయంలో ఎవరూ పాక్‌ ఫైనల్‌కి చేరుతుందని అనుకోలేదు. సొంత ప్రేక్షకులే పాక్‌ టీమ్‌పై నోరు పారేసుకున్నారు. ఇక మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్‌ అయితే తట్టా బుట్టా సర్దేసుకుని వచ్చేయండని ఘాటుగా కామెంట్‌ చేశాడు. అవమానాలను ఎదుర్కొని.. అనుహ్యాంగా పుంజుకుంది బాబర్ సేన. వరుస విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేసింది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్‌ గెలవడం కూడా పాక్‌కి కలిసొచ్చింది. ఫస్ట్ సెమీ ఫైనల్లో కివీస్‌తో తలపడ్డ పాకిస్థాన్‌.. ఆ జట్టుని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆడుతూ పాడుతూ విజయకేతనం ఎగురవేసింది. దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.

పాక్ ప్రత్యర్థి ఇండియానా? ఇంగ్లండా?… టీమిండియా-ఇంగ్లండ్‌ మధ్య సెమీ ఫైట్‌

ఫైనల్లో పాక్‌.. మరి ప్రత్యర్థి ఎవరు..? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పాక్ ప్రత్యర్థి టీమిండియానా.. ఇంగ్లండా అన్న చర్చ జోరందుకుంది. గురువారం ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య సెకండ్ సెమీ ఫైనల్ ఫైట్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు పాక్‌తో ఫైనల్లో తలపడనుంది. సెమీస్‌లో గెలవడం.. పాక్‌తో తలపడటం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌పై భారత్‌ గెలిస్తే మరో హై ఓల్టేజ్‌ ఫైట్‌.. ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించడం ఖాయం.

గత వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితం

15 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ నెగ్గిన టీమ్‌ఇండియా మళ్లీ విజేతగా నిలవలేదు. 2014లో ఫైనల్‌ దాకా వెళ్లి లంక చేతిలో ఓటమిపాలైంది. గత ప్రపంచకప్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగినా గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విజయాలందుకుని సెమీస్‌ చేరింది. భీకర ఆటగాళ్లున్న ఇంగ్లండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. ఆ టీమ్‌ను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయితే రోహిత్‌ సేన మాత్రం అన్ని అస్త్రశస్తాలతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్తాన్‌

భారత్‌-పాక్‌ మధ్య ఫైట్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తాయి. ఒకవేళ ఫైనల్‌ ఫైట్‌ దాయాది దేశాల మధ్య జరిగితే హై ఓల్టేజ్ సమరం తప్పదు. ఈసారి కప్‌ ఎగరేసుకుపోవాలని పాక్‌ కృతనిశ్చయంతో ఉంది. ఇక భారత్‌తో పోరు అంటే ఆ కసి మరో రేంజ్‌కి వెళ్లిపోవడం గ్యారంటీ. అలాగని భారత్‌ను తక్కువగా అంచనా వేస్తే బొక్కాబోర్లా పడటం ఖాయం. మొత్తానికి ఫైనల్‌లో పాక్‌ ప్రత్యర్థి ఎవరన్న ఫీవర్‌.. ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..