PCB : వీళ్లేంటో వీళ్ల విధానాలేంటో ఎవరికి అర్థం కావు.. భారత జట్టుతో ఆడలేదని పాక్ ఆటగాళ్లపై నిషేధం!

భారత జట్టుతో ఆడటానికి అవకాశం లభించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఆటగాళ్లు ఎవరూ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో పాల్గొనరాదని నిషేధం విధించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ఫైనల్ మ్యాచ్ వివరాలను తెలుసుకుందాం.

PCB : వీళ్లేంటో వీళ్ల విధానాలేంటో ఎవరికి అర్థం కావు.. భారత జట్టుతో ఆడలేదని పాక్ ఆటగాళ్లపై నిషేధం!
Pakistan Cricket Board

Updated on: Aug 03, 2025 | 5:00 PM

PCB : వచ్చే సీజన్ నుండి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నమెంట్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు పాల్గొనరు. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. WCL 2025 ఫైనల్ మ్యాచ్ ఇటీవలే ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే, టోర్నమెంట్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఏ సీజన్‌లోనూ పాల్గొనకూడదని నిషేధం విధించింది.

భారత్‌తో ఆడలేదని నిషేధం: పీసీబీ ఆగ్రహం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, ఇండియా ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించడం. ఈ రెండు జట్ల మధ్య మొదట గ్రూప్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, భారత ఆటగాళ్లు ఆ మ్యాచ్‌ను ఆడలేదు. అంతేకాకుండా, సెమీఫైనల్‌లో కూడా భారత్ జట్టు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడలేదు. దీనిపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ జరగకపోయినా, లీగ్ నిర్వాహకులు భారత్‌కు పాయింట్లు ఇవ్వడంపై పీసీబీ తీవ్రంగా స్పందించింది. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులపై పీసీబీ ఆరోపణలు చేసింది. అందుకే ఈ టోర్నమెంట్‌పై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించుకుంది.

‘ఆపరేషన్ సింధూర్’ కారణంగానే..

పీసీబీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం గురించి వివరించింది. భారత్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ కారణంగానే భారత జట్టు (శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్) పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించిందని తెలిపింది.

ఫైనల్‌లో విజేత సౌత్ ఆఫ్రికా

డబ్ల్యూసీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్ తరపున షర్జీల్ ఖాన్ 76 పరుగులు, ఉమర్ అమీన్ 36 పరుగులు (నాటౌట్), ఆసిఫ్ అలీ 28 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించిన సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ జట్టు కేవలం ఒక వికెట్ కోల్పోయి విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరపున ఏబీ డివిలియర్స్ 120 పరుగులు (నాటౌట్) చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇది ఈ సీజన్‌లో అతనికి మూడో సెంచరీ కావడం విశేషం. జెపీ డుమిని కూడా 50 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..