PAK VS SA: ఢీ అంటే డీ.. మైదానంలోనే గొడవకు దిగిన పాకిస్తాన్, సౌతాఫ్రికా ప్లేయర్లు.. వీడియో వైరల్

|

Feb 12, 2025 | 9:59 PM

జెంటిల్మెన్ గేమ్ గా చెప్పుకునే క్రికెట్ లో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయి ప్రత్యర్థి ప్లేయర్లపై నోరు పారేసుకుంటుంటారు. ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పి గొడవకు దిగుతుంటారు. తాజాగా పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ లోనూ అదే జరిగింది.

PAK VS SA: ఢీ అంటే డీ.. మైదానంలోనే గొడవకు దిగిన పాకిస్తాన్, సౌతాఫ్రికా ప్లేయర్లు.. వీడియో వైరల్
Pak Vs Sa Match
Follow us on

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. మరో స్థానం కోసం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోటీ జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు మంచి స్థితిలో ఉంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో, కెప్టెన్ టెంబా బావుమా, బ్రిట్జ్కే రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంలో   పాకిస్తాన్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో జట్టు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్ 28వ ఓవర్‌ను షాహీన్ అఫ్రిదికి అప్పగించాడు. ఈ ఓవర్ ఐదవ బంతికి, మాథ్యూ బ్రిట్జ్కే మిడ్-ఆన్ వైపు ఆడాడు. అయితే దీని తర్వాత బ్రీట్జ్కేతో అఫ్రిది ఏదో మాట్లాడుతూ అతనివైపు చిరాకుగా చూశాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ తో పాటు కెప్టెన్లు రిజ్వాన్, టెంబా బావుమా జోక్యం చేసుకొని గొడవను ఆపేశారు. గొడవ పోయిందనుకున్న సమయంలో 28 ఓవర్లో చివరి బంతి వేసిన తర్వాత మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. షాహీన్ వేసిన చిన్న బంతిని బ్రీట్జ్కే డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన తర్వాత అతను సింగిల్ కోసం పరిగెత్తాడు. పరుగు తీస్తున్న సమయంలో అఫ్రిదిని బ్రీట్జ్కే ఢీ కొట్టాడు. దీంతో అఫ్రిది కోపంతో బ్రీట్జ్కే చూసి మరోసారి గొడవకు దిగాడు. బ్రీట్జ్కే కూడా తగ్గేదేలే అన్నట్లు అఫ్రిది వైపు కోపంగా చూస్తూ మాట్లాడాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఒకే ఓవర్లో రెండు సార్లు గొడవైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

అయితే 29వ ఓవర్లో టెంబా బావుమా, మాథ్యూ బ్రిట్జ్కే భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో పాకిస్తాన్ విజయం సాధించింది. మాథ్యూ బ్రిట్జ్కే పరుగు తీస్తుండగా సౌద్ షకీల్ అతన్ని రనౌట్ చేశాడు. అతను ఔట్ అయిన తర్వాత, కమ్రాన్ గులాం దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పాకిస్తాన్ కు 353 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్రీట్జ్కే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 83 పరుగులు చేశాడు. బ్రీట్జ్కే తో పాటు కెప్టెన్ బవుమా (82), క్లాసన్ (87) రాణించడంతో ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..