2376 పరుగులు, 19 సెంచరీలు, 38 వికెట్లు… ఇవి భారత్‌లో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరింగ్ మ్యాచ్. సరిగ్గా 74 ఏళ్ల క్రితం పూణేలో ఈ మ్యాచ్ జరిగింది. 1949 మార్చి 5-11 మధ్య రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బాంబే, మహారాష్ట్ర జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.
ఈ మ్యాచ్‌లో మొత్తం 38 వికెట్లు పడ్డాయి. ఇది మాత్రమే కాదు, 19 సెంచరీలు కూడా నమోదయ్యాయి. వాటిలో 9 మంది బ్యాటర్లు సాధించినవి కాగా.. 10 మంది బౌలర్లు తెలియకుండా చేసినవి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ మహారాష్ట్రకు చెందిన బాలాసాహెబ్ నింబాల్కర్‌కు మాత్రం పీడకల లాంటిది. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అజేయంగా 443 పరుగులు చేసిన నింబాల్కర్ ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 25, 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
74 ఏళ్ల క్రితం జరిగిన ఈ అతిపెద్ద స్కోరింగ్ మ్యాచ్‌లో 9 మంది బ్యాట్స్‌మెన్లు సెంచరీలు బాదేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బాంబే బ్యాటర్లైన ఎంకే మంత్రి 200, ఉదయ్ మర్చంట్ 143, దత్తు 131 పరుగులు చేయగా.. అటు మహారాష్ట్ర బ్యాటర్లు మనోహర్ దాతర్ 143, మధుసూదన్ 133 పరుగులు సాధించారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా బాంబే బీభత్సంగా బ్యాటింగ్ చేసింది. ఉదయ్ మర్చంట్ 156, దత్తు 160 పరుగులు చేశాడు. మహారాష్ట్ర ప్లేయర్స్ కూడా ఇందుకు ధీటుగా సమాధానం ఇచ్చారు. మధుసూదన్ 100 పరుగులు, శరద్ 146 పరుగులు చేశారు. అయినప్పటికీ, తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. దీంతో బాంబే 354 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బాంబే తొలి ఇన్నింగ్స్‌లో 651 పరుగులు సాధించింది. దీనికి సమాధానంగా మహారాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. 200 పరుగులకు పైగా భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాంబే 8 వికెట్లకు 714 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ముందు 959 పరుగుల భారీ లక్ష్యం నిర్దేషించబడింది. ఇక చివరికి మహారాష్ట్ర జట్టు 604 పరుగులకు ఆలౌటైంది.
రంజీ ట్రోఫీలోని ఈ మ్యాచ్‌లో, 10 మంది బౌలర్లు కూడా 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించి సెంచరీలను పూర్తి చేశారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీరావు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు 3 వికెట్లు, దత్తాత్రేయ చౌదరి 149 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అటు బాంబే నుంచి తొలి ఇన్నింగ్స్‌లో దత్తు 142 పరుగులకు 3 వికెట్లు, కేకీ తారాపూర్ 119 పరుగులకు 6 వికెట్లు తీశారు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్రకు చెందిన బాలాసాహెబ్ 107 పరుగులకు ఒక వికెట్, సాయాజీరావు 126 పరుగులకు ఒక వికెట్, దత్తాత్రేయ 210 పరుగులకు 4 వికెట్లు తీశారు. ఇక బాంబే చివరి ఇన్నింగ్స్‌లో దత్తు 178 పరుగులకు 3 వికెట్లు, కేకి 180 పరుగులకు 3 వికెట్లు, గుల్బారి రాంచంద్ 121 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు.