
ODI World Cup 2027: క్రికెట్ ప్రపంచంలో ఒక జట్టు విజయం మరొక జట్టు భవిష్యత్తును ఎలా మారుస్తుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ఇది. పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో 290 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకున్న బంగ్లా పులులు, పాక్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. అయితే ఈ గెలుపు బంగ్లాదేశ్‌కు సంతోషాన్ని ఇస్తే, రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ (West Indies) జట్టుకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఈక్వేషన్స్ ఈ సిరీస్ పూర్తిగా మార్చేసింది.
వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్‌ను సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆతిథ్య దేశాలుగా సౌతాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన స్థానాల కోసం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ కీలకం కానున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ర్యాంకింగ్స్‌లో మొదటి 8 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. సౌతాఫ్రికా ఇప్పటికే టాప్-8లో ఉంది కాబట్టి, 9వ ర్యాంకులో ఉన్న జట్టుకు కూడా డైరెక్ట్ ఎంట్రీ దొరుకుతుంది. కానీ 10వ ర్యాంకులో గానీ, అంతకంటే తక్కువలో గానీ ఉంటే మాత్రం మళ్ళీ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడి గెలవాల్సి ఉంటుంది.
పాకిస్థాన్‌పై గెలుపుతో బంగ్లాదేశ్ ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం నుండి 9వ స్థానానికి ఎగబాకింది. దీనివల్ల ఇప్పటివరకు 9వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ 10వ స్థానానికి పడిపోయింది. విండీస్ జట్టు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ర్యాంకింగ్స్‌లో వెనక్కి వెళ్ళిపోవడం ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2023 వన్డే వరల్డ్ కప్‌కు కూడా వెస్టిండీస్ క్వాలిఫై కాలేకపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో క్వాలిఫైయర్ టోర్నీలో పసికూనల చేతిలో ఓడిపోయి టోర్నీకి దూరమైంది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.
వెస్టిండీస్ తన డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే సెప్టెంబర్-అక్టోబర్‌లో భారత్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. టీమ్ ఇండియాపై గెలిచి పాయింట్లు సాధిస్తే తప్ప వెస్టిండీస్ ర్యాంకింగ్ పెరిగే అవకాశం లేదు. ఒకవేళ అక్కడ కూడా విఫలమైతే, 1975, 1979 ఛాంపియన్లు మళ్ళీ పసికూనలతో క్వాలిఫైయర్స్ లో పోరాడాల్సి వస్తుంది. పాకిస్థాన్ ఈ సిరీస్ ఓడిపోయినా ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలోనే ఉంది కానీ, వెస్టిండీస్ భవిష్యత్తును మాత్రం అంధకారంలోకి నెట్టేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..