T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్..భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు..పంతం నెగ్గించుకున్న బీసీసీఐ

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌లో అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలను వేదికలుగా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ తన నాలుగు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను భారత్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఆడనుంది.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్..భారత్‌లోనే బంగ్లాదేశ్ మ్యాచ్‌లు..పంతం నెగ్గించుకున్న బీసీసీఐ
T20 World Cup 2026 (1)

Updated on: Jan 07, 2026 | 4:06 PM

T20 World Cup 2026 : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. అంటే షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడాల్సి ఉంటుంది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 నిర్వహణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలు, రాజకీయ పరిస్థితులను సాకుగా చూపి తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరినప్పటికీ ఐసీసీ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, హోటల్ బుకింగ్స్, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్స్ ఖరారైనందున ఈ దశలో మార్పులు చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది. దీనిపై తుది నిర్ణయం జనవరి 10న వెలువడాల్సి ఉన్నా, వేదికల మార్పు ఉండదని దాదాపు ఖాయమైపోయింది.

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌లో అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలను వేదికలుగా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ తన నాలుగు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను భారత్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఆడనుంది. మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుండగా, చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

బంగ్లాదేశ్ పూర్తి షెడ్యూల్ ఇదే:

ఫిబ్రవరి 7: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)

ఫిబ్రవరి 9: బంగ్లాదేశ్ vs ఇటలీ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)

ఫిబ్రవరి 14: బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)

ఫిబ్రవరి 17: బంగ్లాదేశ్ vs నేపాల్ (వాంఖడే స్టేడియం, ముంబై)

మార్పు ఎందుకు సాధ్యం కాదు?

ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. కేవలం ఒక జట్టు కోసం షెడ్యూల్ మారిస్తే అది ఇతర జట్ల ప్రయాణ ప్రణాళికలు, ప్రాక్టీస్ షెడ్యూల్స్‌ను దెబ్బతీస్తుంది. అలాగే, ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్-బి మ్యాచ్‌లు ఇప్పటికే శ్రీలంకలో జరగాల్సి ఉంది. పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. బంగ్లాదేశ్ కూడా అక్కడికే వెళ్తే వేదికలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఐసీసీ కఠినంగా వ్యవహరించి భారత్‌లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి