మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. బ్యాటర్లే కాదు, బౌలర్లు, ఫీల్డర్లు ఇలా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలర్ల గురించి మాట్లాడితే.. తమ ఆనందాన్ని ఒక్కోక్కరు ఒక్కోలా వెల్లడిస్తుంటారు. వికెట్ తీసిన ఆనందంలో కొందరు చాలా దూరం పరుగెత్తుంటారు. మరికొందరు గట్టిగా అరుస్తుంటారు. కొందరు దూకుడుగా సంజ్ఞలు చేస్తుంటారు. మరికొందరు చప్పట్లు కొడుతుంటారు. ప్రతి బౌలర్ తన వికెట్‌ను వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కానీ, నేపాల్ యువ బౌలర్ కూడా ఇలాంటి సంబరాలు చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. కానీ, కథ అడ్డం తిరిగే సరికి మైదానం నుంచి మోసుకెళ్లాల్సి వచ్చింది. అండర్-19 ఆసియా కప్‌లో, నేపాల్ బౌలర్ యువరాజ్ ఖత్రీ వికెట్ తీసిన సంబరాల్లో మునిగిపోయాడు. ఆ ఆనందం వెంటనే, ప్రమాదం సంభవించింది. అతన్ని మైదానం నుంచి బయటకు తీయవలసి వచ్చిందన్నమాట.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఐదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, నేపాల్ అండర్-19 జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 141 పరుగులు మాత్రమే చేసింది. నేపాల్ ఓపెనర్ ఆకాష్ త్రిపాఠి అత్యధికంగా 43 పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 29 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో పడిన 5 వికెట్లలో, స్పిన్నర్ యువరాజ్ ఖత్రీ 4 వికెట్లు తీయడం గమనార్హం. అయితే, వీటిలో ఒక వికెట్ అతనికి చాలా ఖరీదైనదిగా మారింది.
ఈ 17 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఇన్నింగ్స్ 28వ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ముందుగా ఫరీద్ హసన్‌ను బౌల్డ్ చేసి షూ విప్పి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే కొత్త బ్యాట్స్‌మెన్ రిజాన్ హోసన్‌కు ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేసి పూర్తి ఉత్సాహంతో లాంగ్ రన్ చేశాడు. అప్పుడు అతను తన స్నేహితులతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఈ ఉత్సాహంలో అతని ఎడమ కాలు చీలమండ మెలితిరిగింది. దీంతో నొప్పితో మూలుగుతున్నాడు.
A twist of fate 🫣
When luck smiles and frowns at the same time 🤕 🙆♂️#SonySportsNetwork #AsiaCup #NewHomeOfAsiaCup pic.twitter.com/OmPn5KepPu
— Sony Sports Network (@SonySportsNetwk) December 2, 2024
ఇక్కడ యువరాజ్ నొప్పితో మూలుగుతూ మైదానంలో కూర్చున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి అతన్ని పరీక్షించాడు. పరిస్థితి బాగాలేకపోవడంతో తోటి ఆటగాడిని పిలిచి యువరాజ్‌ని భుజంపై ఎత్తుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం యువరాజ్ పరిస్థితిపై నేపాల్ జట్టు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేపాల్ తదుపరి మ్యాచ్ మంగళవారం డిసెంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..