టీమిండియా జెర్సీ ధరించాలన్న తిలక్ వర్మ కల త్వరలో సాకారం కానుంది. వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు ఈ తెలుగు క్రికెటర్ ఎంపికయ్యాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో అదరగొడుతోన్నాడు తిలక్. ముఖ్యంగా 2023 సీజన్‌లో 164.11 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించుకున్నాడు. ఈక్రమంలోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. కాగా విండీస్ పర్యటనలో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా. ఇందుకోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. ప్రస్తుతం విండీస్‌తో సిరీస్ కోసం సన్నద్ధమవుతోన్న తిలక్ టీమిండియాకు ఎంపిక కావడంపై స్పందించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అమ్మానాన్నలకు వీడియో కాల్ చేశానని, వారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడీ హైదరాబాదీ క్రికెటర్. అలాగే తన కోచ్ సలాం బయాష్ కూడా ఎమోషనల్ అయ్యారన్నాడు.
‘నేను ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్నాను. దీంతో రాత్రి వరకు నేను టీమిండియాకు ఎంపికైన విషయం తెలియలేదు. రాత్రి 8 గంటల సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. వెంటనే మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. దీంతో వారు ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కోచ్ సలాం బయాష్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ముఖ్యంగా కీరన్ పొలార్డ్ చెప్పిన సలహాలు, సూచనలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి’ అని చెప్పుకొచ్చాడు తిలక్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..