Rohit Sharma : ఆరో ట్రోఫీ మనదే.. ముంబై ఇండియన్స్ అభిమానులకు ప్రామిస్ చేసిన హిట్ మ్యాన్

Rohit Sharma : ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 ప్రయాణం మార్చి 29న మొదలవుతుంది. ఆరో ట్రోఫీ గెలుస్తామని రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశాడు. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్ కోసం ద మిక్స్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

Rohit Sharma : ఆరో ట్రోఫీ మనదే.. ముంబై ఇండియన్స్ అభిమానులకు ప్రామిస్ చేసిన హిట్ మ్యాన్
Rohit Sharma Mi

Updated on: Mar 22, 2026 | 5:20 PM

Rohit Sharma : ఐపీఎల్ 2026 (IPL 19) రణరంగం మొదలవ్వడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈసారి ఎలాగైనా ఆరో ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉంది. మార్చి 29న వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడటం ద్వారా ముంబై తన ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ద మిక్స్ (The Mix) అనే బాండింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ప్రామిస్ చేశాడు.

ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్‌లో శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్ కోసం ద మిక్స్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు రోహిత్ శర్మ తన గారాల పట్టి సమైరాతో కలిసి రాగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మేమంతా కలిసి ఈసారి ఆరో ట్రోఫీని ముంబైకి తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం” అని మాటిచ్చాడు. రోహిత్ నోట ఈ మాట రావడంతో ఎంఐ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టుకు గత కొన్ని ఏళ్లుగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2020లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆ జట్టు కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. ముఖ్యంగా 2024 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి అభిమానులను నిరాశపరిచింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై గతంలో విమర్శలు వచ్చినప్పటికీ, ఈసారి జట్టులో గట్టి బాండింగ్ కనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు, యువ రక్తం కలిసి జట్టును విజయపథంలో నడిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టడం ఖాయం. రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫినిషర్లుగా ఉన్నారు. వీరితో పాటు క్వింటన్ డికాక్, రేయాన్ రికెల్టన్ వంటి విధ్వంసకర విదేశీ ఆటగాళ్లు తోడవ్వడంతో ముంబై బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా బుమ్రా వంటి యోధుడు ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతుంది. సొంత మైదానం వాంఖడేలో ఈ మ్యాచ్ జరగనుండటంతో అభిమానుల సపోర్ట్ జట్టుకు పుష్కలంగా లభించనుంది. ప్రాక్టీస్ సెషన్లలో రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ భారీ షాట్లు ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ అన్న ప్రామిస్ ప్రకారం ఈసారి ముంబై ఆరో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us