MS Dhoni: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.!

|

Mar 24, 2022 | 4:26 PM

ఐపీఎల్ 2022కు ముందు ఫ్యాన్స్‌కు పెద్ద షాకిచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు..

MS Dhoni: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.!
Ms Dhoni
Follow us on

మరికొద్ది గంటల్లో క్రికెట్ పండుగ మొదలు కానుంది. కళ్లు కాయలు కాచేలా అభిమానులు మహేంద్ర సింగ్ ధోని కోసం ఎదురు చూస్తుంటే.. అనూహ్యంగా మిస్టర్ కూల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. దీనితో చెన్నై సారధ్య బాధ్యతలు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేపట్టనున్నాడు. 2008 నుంచి సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. ఆ జట్టును నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.

2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై జట్టు ధోని సారధ్యంలోనే ఐపీఎల్ విజేతగా నిలిచింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రెండేళ్ల బ్యాన్ తర్వాత 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఎంఎస్ ధోని ఫైనల్‌కు చేర్చిన తీరు అమోఘం అని చెప్పాలి. వికెట్ల వెనుక ధోని తీసుకునే కూల్ నిర్ణయాలు ఫలితం చెన్నై జట్టుకు అనుకూలంగా వచ్చేలా చేస్తాయి. ఇదిలా ఉంటే.. ధోని మొత్తంగా 204 మ్యాచ్‌లు చెన్నైకు సారధ్యం వహించగా.. అందులో 121 విజయాలు అందుకున్నాడు. ధోని సారధ్యంలో చెన్నై నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. 9 సార్లు ఫైనల్‌కు చేరుకుంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ.. మహేంద్ర సింగ్ ధోని మరో రెండు సీజన్లు తమతోనే ఉంటాడని స్పష్టం చేసింది. 2012 నుంచి ధోని సారధ్యంలోనే టీంలో కీలక ప్లేయర్‌గా జడేజా ఎదిగాడని.. ధోని వారసుడిగా జడేజాకు జట్టును నడిపించే సామర్ధ్యం ఉందని సీఎస్కే ఫ్రాంచైజీ సీఈఓ తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు రవీంద్ర జడేజా మూడో కెప్టెన్‌…

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు. 213 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని 130 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైనా ఆరు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు, అందులో కేవలం రెండు విజయాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ 15 ఏళ్లలో జడేజా చెన్నై జట్టుకు మూడో కెప్టెన్‌గా అవతరించాడు.

కాగా, ధోని మరోసారి తనదైన శైలిలో ఈ నిర్ణయాన్ని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. 2014లో అనూహ్యంగా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని.. రెండేళ్ల తర్వాత 2016లో టీ20, వన్డే కెప్టెన్సీని విరాట్ కోహ్లీకి అప్పగించాడు. ఇక 15 ఆగస్టు 2020న అందరికీ షాక్ ఇస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు.