LSG vs CSK, IPL 2022: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన మిస్టర్ కూల్.. టీ 20ల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా, ఓవరాల్‌గా ఆరో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. ధోని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప మాత్రమే టీ20ల్లో 7వేలకు పైగా పరుగులు సాధించారు. కాగా ఇప్పటివరకు మొత్తం 349 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని 7వేల పరుగులు మార్కును అధిగమించాడు. కాగా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను టీ20ల్లో మొత్తం 14,562 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో పాక్ కు చెందిన షోయబ్ మాలిక్ రెండు, కీరన్ పొలార్డ్ మూడు, ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
కాగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతాపై అర్ధసెంచరీతో రాణించాడు ధోని. ఇక తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ 6 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టు భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్‌గా చెన్నై జట్టుకు నాలుగుసార్లు ట్రోఫీ అందించాడు. కాగా ఐపీఎల్2022 ప్రారంభానికి రెండు రోజుల ముందే తన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.