
Vogue India Interview : 2025 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టు సాధించిన విజయం దేశ క్రీడా చరిత్రలో ఒక అసాధారణ ఘట్టం. దశాబ్దాలుగా మహిళా క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడిన వారికి, ఈ గెలుపు ఒక గట్టి జవాబు. రికార్డు స్థాయి ప్రైజ్ మనీ, పురుషుల ఫైనల్‌కు సమానమైన టీవీ వీక్షకుల సంఖ్యతో, ఈ విజయం మహిళల క్రీడాకారుల పట్ల దేశం అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. అర్ధరాత్రి వేళ వచ్చిన ఈ అద్భుత గెలుపు తర్వాత, విజయోత్సవ క్షణాలను, తమ ప్రయాణంలోని పోరాటాలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహా జట్టులోని ముఖ్య సభ్యులు వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
భారత మహిళా క్రికెట్‌లో నేడు మనం చూస్తున్న ఈ అద్భుత విజయం వెనుక, చిన్ననాటి నుంచే వారు చేసిన పోరాటాలు ఉన్నాయి. ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఆగ్రాలో అబ్బాయిలు ఆడుతుంటే బౌండరీ లైన్ పక్కన దూరంగా నిలబడి చూసిన రోజులు దీప్తి శర్మకు గుర్తున్నాయి. తనకు చోటు లేదనుకున్న చోట నిలబడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేసేటప్పుడు జుట్టు అడ్డు వస్తుందని తన పొడవాటి జుట్టును కత్తిరించుకుంది. షఫాలీ వర్మ రోహ్‌తక్‌లో అబ్బాయిల మ్యాచ్‌లో ఆడటానికి తన జుట్టును క్యాప్‌లో దాచుకుని, పెద్ద సైజ్ జెర్సీ వేసుకుని వెళ్ళింది. తమకు చోటు లేదనుకున్న చోట మొండిగా నిలబడిన ఈ తరమే, నేడు భారత క్రీడా ప్రపంచంలో మహిళల గుర్తింపును ఒక హక్కుగా మార్చగలిగింది.
Photo Credited by Jacky Nayak, Vogue
2005,2017 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓటముల నిరాశను దిగమింగుకుని బరిలోకి దిగిన ఈ జట్టు, ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. దీప్తి శర్మ (ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, 58 పరుగులు, 5/39), షఫాలీ వర్మ (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, 87 పరుగులు, 2/36) ప్రదర్శనతో భారత్ తొలిసారి ప్రపంచ కప్‌ను గెలిచింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ విజయం తనకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చిందని, కొన్నాళ్లపాటు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని తెలిపింది. 21 ఏళ్ల షఫాలీ వర్మ ఇప్పుడు తన స్టైల్స్‌పై దృష్టి పెడుతోంది. “ఇప్పుడు చాలా మంది మమ్మల్ని చూస్తున్నారు, వాళ్లు మమ్మల్ని కొత్త ఫ్యాషన్ స్టైల్స్‌లో కూడా చూడాలని కోరుకుంటున్నాను” అని ఆమె ఉత్సాహంగా చెప్పింది.
Photo Credited by Jacky Nayak, Vogue
కాలికి గాయం వల్ల పట్టీ ఉన్నప్పటికీ, ఆల్‌రౌండర్ ప్రతికా రావల్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేసింది. “నా సెలబ్రేషన్స్‌కు నా కాస్ట్ అడ్డురావడానికి వీల్లేదు” అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఈ విజయం కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితం కాలేదు. గెలిచిన వెంటనే జెమీమా రోడ్రిగ్స్ తమ ఫ్యాన్ గ్రూప్ బకెట్ హ్యాటర్స్ దగ్గరకు పరుగెత్తి సెల్యూట్ చేసింది. రిచా ఘోష్ స్వస్థలం సిలిగురిలో ఆమె పేరు మీద స్టేడియం రాబోతోంది. ప్రతి అథ్లెట్ తమ స్వస్థలాలకు చేరుకోగానే ప్రజలు, పాఠశాల విద్యార్థులు వారికి ఘనస్వాగతం పలికారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “ఫైనల్ రోజు వేలాది మంది ప్రజలు మా కోసం ప్రార్థించడం చూశాను. దేశం మొత్తం మమ్మల్ని నమ్మినప్పుడు మీరు అందరి కోసం ఆడి గెలుస్తారు. ఈ విజయం యువతులకు, అమ్మాయిలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మేము చేయగలిగితే, వాళ్లూ చేయగలరు” అని స్పష్టం చేసింది.
Photo Credited by Jacky Nayak, Vogue
గతంలో సురేశ్ రైనాను ఆదర్శంగా తీసుకున్న దీప్తి శర్మ, ఇప్పుడు చిన్నపిల్లలు నేను దీప్తి శర్మలా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం వింటోంది. రోహ్‌తక్‌లో కుస్తీకి బదులు, షఫాలీ వర్మ కారణంగా క్రికెట్ అకాడమీలు పెరుగుతున్నాయి. ఇది భారతీయ బాలికలకు అవకాశాల కొత్త తలుపు తెరిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..